జిల్లాల రద్దు అవివేకం : మాజీ మంత్రి
వనపర్తిటౌన్: జిల్లాల ఏర్పాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం శాసీ్త్రయంగా కమిటీ వేసి నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని ఏడాది పాటు కసరత్తు చేసిందని రూపొందించిందని.. పదేళ్లుగా ప్రజలు అలవాటు పడ్డారని, శాశ్వత నిర్మాణాలు జరిగిన తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామనడం అవివేకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల్లో కలిపి 3.50 కోట్ల జనాభా ఉంటే 45 జిల్లాలు ఉన్నప్పుడు.. 4.50 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 33 జిల్లాలు ఉండటం తప్పేందటని ప్రశ్నించారు. త్వరలో జరిగే పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాల రద్దుకు లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని.. జిల్లాల మనుగడ కోసం ఓటేయొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికులకు 95 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నాటి సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. అసలైన కాంగ్రెస్ నాయకులు స్పందించకపోతే రేవంత్‌రెడ్డే కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని.. ప్రజలు, కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయిస్తారో తెలియకుండా తానే మళ్లీ సీఎంనని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ దిమ్మెలను కూలదోయండని సీఎం స్థాయిలోని వ్యక్తి చెప్పడం హింసను ప్రేరేపించినట్లేనని.. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయకపోతే బీఆర్‌ఎస్ తరఫున పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని.. తెలంగాణ పక్షాన నిలవనందుకే ఈ ప్రాంతంలో కనుమరుగైందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, బి.లక్ష్మయ్య, రమేష్‌గౌడ్, కరుణ, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు రఘుపతిరెడ్డి, భీమన్న, మాజీ ఎంపీపీ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.


