విజయనగరం రూరల్:
పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సంక్షేమ పథకాలనే అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకపోతే రేషన్ కార్డులు తొలగిస్తామని, పింఛన్లు నిలిపివేస్తామని కొందరు నాయకులు హెచ్చరిస్తున్నట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంక్షేమ పథకాలు మంజూరు చేయిస్తామని అర్హులతో పాటు అనర్హుల నుంచి అనధికారికంగా దరఖాస్తులు తీసుకున్న కూటమి పార్టీల నేతలు, పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతు అభ్యర్థులకు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయమనే భయాన్ని పేదల మనసుల్లో నాటే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓటర్లు తమ నిర్ణయానికే కట్టుబడుతున్నారనే సంకేతాలు తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి.
● రెండో విడతకు సర్వం సిద్ధం
తొలి విడత ఫలితాల నేపథ్యంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజాం నియోజకవర్గంలోని రాజాం, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, వంగర, గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ, గంట్యాడ, జామి మండలాల్లో ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. ఈ 10 మండలాల పరిధిలో 308 గ్రామ పంచాయతీలు ఉండగా, 64 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 244 పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
● ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగిసింది. అయితే రెండో విడత జరగనున్న గ్రామపంచాయతీలతో పాటు మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రసార సమావేశాలకు ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సమావేశాలకు రప్పిస్తున్న దాఖలాలు అనేక చోట్ల చోటు చేసుకుంటున్నాయి. విజయనగరం మండలంలోని అనేక గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రచార కార్యక్రమాలకు స్వయం సహాయక సంఘాల మహిళలను, ఉపాధిహామీ వేతన దారులను బలవంతంగా సమావేశాలకు రప్పిస్తున్నారు. రానివారికి అధికార పార్టీ నేతలతో పాటు, ఆయాశాఖల సిబ్బంది ఉపాధి పనులు, ఇతర పథకాలు తీసివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలు గ్రామాల ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
● చివరి రోజు వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, నాయకులు చేసిన ప్రయత్నాలకు శుక్రవారంతో తెరపడింది. పంపకాలకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆదివారం పోలింగ్‌తో తేలనుంది.
బెదిరింపులా.. ఓటర్ల నిర్ణయమా?
సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణలు నిజంగా ఓటర్లను ప్రభావితం చేస్తాయా? లేక తొలి విడతలో మాదిరిగానే తమకు నచ్చిన అభ్యర్థికే ఓటువేసి అధికార పార్టీకి మరోసారి గుణపాఠం చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. రేషన్‌కార్డు, పింఛన్ వంటి పేదల జీవనాధార పథకాలను రాజకీయ బెదిరింపులకు వాడుతున్నారనే ఆరోపణలు ఎన్నికల వేళ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారి హెచ్చరికలకు ఓటర్లు తలొగ్గుతారా.. లేక ఓటు విలువను చాటుతారా అన్నది రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లకు
బెదిరింపులు
గ్రామాల్లో అధికార పార్టీ ఆగడాలు
అయినా బెదరని పల్లె ఓటర్లు


