రెండోదశ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రెండోదశ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

● కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం రూరల్‌: జిల్లాలో రెండోదశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్నిశాఖల అధికారుల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై జిల్లా అధికారులు, ఆర్డీఓలు, డివిజన్‌ స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రెండవ దశలో జిల్లాలోని 10 మండలాల్లో 308 గ్రామ పంచాయతీలకు 64 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 244 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 1,996 వార్డులకు, 2,275 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల విధుల కోసం 2,761 మంది పీఓలు, 3,395 మంది ఓపీఓలు, 310 వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, జామి, గంట్యాడ మండలాల్లో సిబ్బంది అవసరం అధికంగా ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తగినంత లైటింగ్‌, జనరేటర్లు, అవసరమైన కౌంటింగ్‌ టేబుళ్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధిత ఎంపీడీఓలు, తహసీల్దార్లు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గుర్తించిన 112 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో 67 సమస్యాత్మక, 45 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. మొదటి దశ ఎన్నికలు పూర్తయిన మండలాల ఎంపీడీఓల సేవలను అవసరమైన కీలక మండలాల్లో వినియోగించుకోవాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. అన్ని మండలాల్లో అదనపు సిబ్బంది, బ్యాలెట్‌ బాక్సులు, పోస్టల్‌ బ్యాలెట్లు, జనరేటర్లు, లైటింగ్‌, రవాణా, రిపోర్టింగ్‌ బృందాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, ఆర్డీఓలు, డీడీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

1600 మంది పోలీసులతో బందోబస్తు

విజయనగరం టౌన్‌: విజయనగరం జిల్లాలో ఈ నెల 29న రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు 1600 మంది పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహించనున్నట్టు ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పది మండలాల్లో 95 రూట్‌ మొబైల్స్‌ ఉంటాయన్నారు. వీటికి అదనంగా 20 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు, 10 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్సులు, 5 జోనల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లను ఏర్పాటుచేశామన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement