● ఏపీలో ఎంపికై న ఏడు సంస్థల్లో
సీతం ఒకటి
విజయనగరం అర్బన్: గాజులరేగలోని సీతం కళాశాలలో రెండు రోజుల క్వాంటం కంప్యూటింగ్ ఉత్సవం–2026 శుక్రవారం ప్రారంభమైంది. కళాశాల క్వాంటం, కృత్రిమ మేధస్సు ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో, ఐబీఎం క్వాంటం సహకారంతో ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లో దీనిని నిర్వహిస్తున్నారు. ఉత్సవాన్ని ప్రారంభించిన కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 సంస్థలు ఈ ఉత్సవానికి ఎంపిక కాగా, రాష్ట్రంలో ఎంపికై న ఏడింటిలో సీతం ఒకటి కావడం విశేషమన్నారు. క్వాంటం కంప్యూటర్లు సంప్రదాయ కంప్యూటర్లకు బదులుగా కాకుండా, వాటితో కలిసి ఔషధ పరిశోధన, కొత్త పదార్థాలు, సమాచార భద్రత వంటి రంగాల్లో కీలకంగా మారుతాయని చెప్పారు. ‘సాంకేతిక విప్లవాలను సృష్టించేందుకు సిద్ధమయ్యే వారిదే భవిష్యత్తు‘ అని విద్యార్థులకు సూచించారు. ముఖ్య అతిథి, మాలవ్య ఇన్‌నిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జైపూర్) ప్రొఫెసర్ ఎమాన్యుయేల్ ఎస్.పిళ్లి క్యూబిట్ల నిర్మాణంపై, ప్రొఫెసర్ పెదపాటి అనిల్ కుమార్ రాష్ట్రంలో క్వాంటం అవకాశాలపై, అమరావతి క్వాంటం వ్యాలీ సలహాదారు వెంకట స్వామి తాడికొండ విద్యార్థుల ప్రాజెక్టు భాగస్వామ్యంపై ప్రసంగించారు. మధ్యాహ్నం జరిగిన సాంకేతిక సవాళ్ల పోటీలో 50 మంది విద్యార్థులు బృందాలుగా ఐబీఎం క్యూ స్కిట్ వేదికపై నిజమైన క్వాంటం కంప్యూటర్లతో ప్రయోగాలు చేశారు. మొత్తం 160 మంది హాజరయ్యారు. శనివారం ఐబీఎం, క్యూబిటెక్, డీఆర్‌డీఓ (విశాఖ) నిపుణుల ప్రసంగాలు, ప్రశ్నోత్తర పోటీ, బహుమతి ప్రదానం ఉంటాయి. పాల్గొన్నవారికి ఐబీఎం ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, ఆర్‌అండ్‌డీ డీన్ డాక్టర్ వీజీ ప్రసూన, సమన్వయకర్త డాక్టర్ జి.శ్రీచందన, విభాగాధిపతి డాక్టర్ డి.రాధ తదితరులు పాల్గొన్నారు.


