మరో రెండు రోజులే..గడువు! | - | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజులే..గడువు!

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

మరో రెండు రోజులే..గడువు!

విజయనగరం: జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజులు సమయం మాత్రమే ఉంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థుల నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్ల వరకు అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. సమయం తక్కువగా ఉండడం, అధికారిక లాంఛనాలు పూర్తి కావాల్సి ఉండడంతో ఉత్కంఠగా మారింది.

ముహూర్తం బాగుండాలని..

పార్టీల నుంచి ఆశీస్సులు లేదా అనధికారికంగా అభ్యర్థిత్వంపై స్పష్టత లభించిన వారు..ఇప్పటికే తమ హడావుడిని మొదలుపెట్టేశారు. సరిగ్గా మూడు రోజులే గడువు ఉండడంతో నామినేషన్‌ దాఖలుకు ’మంచి ముహూర్తం’, శుభ ఘడియల కోసం జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా కలిసొచ్చే అదష్టం చేజారిపోతుందనే నమ్మకంతో గడియారపు ముళ్లతో పోటీపడుతున్నారు.

అన్నింటినీ సిద్ధం చేసుకుంటూ..

టికెట్‌ ఖరారైన వారితో పాటు..ఇంకా స్పష్టత రాని ఆశావహులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. చివరి నిమిషంలో అధిష్ఠానం కరుణిస్తే..క్షణం ఆలస్యం చేయకుండా నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సెంటిమెంట్లు తెరపైకి వచ్చాయి. స్థానిక ప్రముఖ దేవాలయాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కొందరు తమ ఇష్టదైవాలను దర్శించుకుని, కొబ్బరికాయలు కొట్టి నామినేషన్‌ పత్రాలపై సంతకాలకు సిద్ధమవుతున్నారు. మరికొందరు కుటుంబసభ్యుల సమక్షంలో సెంటిమెంట్‌ రంగుల దుస్తులు ధరించి..నామినేషన్‌ కేంద్రాల బాట పట్టేందుకు సన్నద్ధమవుతు న్నారు.

పత్రాల వేటలో పరుగులు

అభ్యర్థిత్వాలపై ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుంటే..మరోవైపు ‘నో డ్యూస్‌’ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నామినేషన్‌ సెట్లు సిద్ధం చేసుకోవడం అభ్యర్థులకు కత్తి మీద సాములా మారింది. వ్యవధి తక్కువగా ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. ధ్రువీకరణ పత్రాలు సమకూర్చుకునేందుకు పరుగులు పెడుతున్నారు.

రెండు రోజులు ఎలా ఉంటాయో..?

మున్సిపల్‌ పీఠాలను కై వసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతుంటే.. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు మాత్రం ముహూర్తాలు, సెంటిమెంట్ల నడుమ ఉత్కంఠ పోరును ఎదుర్కొంటున్నారు. రానున్న రెండు రోజులు పురపాలక రాజకీయం ఎలాంటి అనూహ్య పరిణామాలకు తెరలేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి తెలుసుకోండి..

నగరపాలక సంస్థలో మేయర్‌, కార్పొరేటర్‌ పదవులకు పోటీ చేసేవారు ఫారం–8లో నామినేషన్‌ సమర్పించాలి. పురపాలికల్లో చైర్మన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు ఫారం–1 ఉపయోగించాలి. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. అభ్యర్థులకు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి.

● అభ్యర్థి పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, చిరునామా, సామాజికవర్గం, ఓటరు జాబితాలో పేరు ఉన్న వార్డు, క్రమసంఖ్య వివరాలు నమోదు చేయాలి.

● మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు జనరల్‌ అయితే రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారైతే రూ.2,500, మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు జనరల్‌ అయితే రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1500 డిపాజిట్‌ చెల్లించాలి.

● ఒక అభ్యర్థి ఒకే పదవికి గరిష్టంగా 4 నామినేషన్‌ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఏదైనా పత్రంలో లోపం ఉన్నప్పటికీ మరో పత్రం నిబంధనలకు అనుగుణంగా ఉంటే సరిపోతుంది.

అభ్యర్ధుల్లో తీరని గుబులు

నామినేషన్‌లు వేసేందుకు సన్నాహాలు

మంచి ముహూర్తం కోసం పండితుల చుట్టూ ప్రదక్షిణ

అవసరమైన పత్రాల కోసం వెతకులాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement