పరేడ్‌ గ్రౌండ్‌ వీడి ప్రజా రక్షణకు.. | - | Sakshi
Sakshi News home page

పరేడ్‌ గ్రౌండ్‌ వీడి ప్రజా రక్షణకు..

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

పరేడ్‌ గ్రౌండ్‌ వీడి ప్రజా రక్షణకు..

నిరంతర కఠోర శ్రమ.. ఎన్నో ఒడిదుడుకులు.. శిక్షణ సమయంలో కన్నీటిగాథలు.. కుటుంబానికి దూరమై, అకుంఠిత దీక్షతో తొమ్మిది నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాసేవకు వస్తున్నారు మహిళా కానిస్టేబుళ్లు. విజయనగరం పీటీసీలో శిక్షణ పూర్తయిన నేపథ్యంలో, సోమవారం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణకు నడుం బిగిస్తున్న మహిళామణులకు సెల్యూట్‌..

తొమ్మిది నెలల శిక్షణే అంకురార్పణ..

నా పేరు దాట్ల నీలిమ. మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. మా తండ్రి వ్యవసాయం చేస్తుంటారు. తల్లి గృహిణి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌ చేస్తూ, అన్నయ్య సహకారంతో ఇంట్లోనే ఉంటూ పోలీస్‌ ఉద్యోగానికి ప్రిపరేషన్‌ ప్రారంభించాను. ఇదే నోటిఫికేషన్‌లో మా ఇద్దరం ఉద్యోగం సాధించాం. ఎస్సై ఉద్యోగం సాధించాలనేది లక్ష్యం. పీటీసీలో ప్రిన్సిపల్‌ ఎంతో ధైర్యాన్నిచ్చారు. తొమ్మిది నెలల పాటు మీరు చేసిన సాధనే, రాబోయే 40 ఏళ్ల సేవకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పడం మాలో ధైర్యాన్నింపింది.

– దాట్ల నీలిమ, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం

నాన్న బాటలోనే..

నా పేరు తగరంపూడి ధరణి అపర్ణ, మాది రాజమండ్రి. పోలీస్‌ ఉద్యోగమంటే చిన్నప్పటి నుంచి ఓ కల. నాన్న రాజమండ్రిలో హెచ్‌సీగా, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన 2018లో మరణించారు. మేము ముగ్గురు అక్కాచెల్లెళ్లు. పెద్దక్క కానిస్టేబుల్‌, రెండో అక్క జీఎస్‌టీలో జూనియర్‌ అసిస్టెంట్‌. నేను జేఎన్‌టీయూలో పెట్రో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. రెండేళ్ల పాటూ టీసీఎస్‌లో వర్క్‌ చేశాను. ఎంతో కష్టపడి ప్రిపేర్‌ అయి, ఉద్యోగం సాధించాను. పీటీసీలో ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.

– తగరంపూడి ధరణి అపర్ణ, రాజమండ్రి,

తల్లిదండ్రుల కల నిజం చేశా..

మాది ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామం. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. మా గ్రామానికి బస్సు లేకపోవడంతో డిగ్రీ చదివే రోజుల్లో ఎనిమిది కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుని చదువు పూర్తి చేశాను. పోలీసు కావాలనే తల్లిదండ్రుల కలని నిజం చేయాలనుకున్నాను. కానీ స్తోమత లేకపోవడంతో ఎటువంటి కోచింగ్‌ లేకుండానే యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుని, ఓపెన్‌ క్యాటగిరీలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. పోలీస్‌శాఖకు మంచిపేరు తీసుకుకొచ్చేలా ప్రజాసేవలో తరిస్తాను.

– టి.కల్పన, ప్రకాశం జిల్లా

ప్రభుత్వ హాస్టల్‌లో

ఉంటూ విద్యాభ్యాసం..

నా పేరు అండ్రాజు మౌనిక. మాది గుంటూరు జిల్లా, కంచర్లపాలెం గ్రామం. మా నాన్న లారీ డ్రైవర్‌ కాగా అమ్మ శివకుమారి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలం కావడం వల్ల మేమంతా ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకొనసాగించాం. తొలుత మత్స్యశాఖలో అవుట్‌సోర్సింగ్‌లో జాబ్‌ వచ్చింది. అదిచేస్తూ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్‌ అయ్యాను. అదే సమయంలో పీజీ పూర్తిచేశాను. ఎంతో కష్టపడి కానిస్టేబుల్‌కి ప్రిపేర్‌ అయి, ఉద్యోగం సాధించాను. మహిళలు మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో, శారీరకంగా కూడా అంతే దృఢంగా ఉండాలి. సాధారణ మహిళలుగా వచ్చిన తమను శివంగిల్లా తీర్చిదిద్దిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. – ఎ.మౌనిక, గుంటూరు జిల్లా

కఠినమైన శారీరక శిక్షణ, సమగ్ర న్యాయ విద్య, ఆచరణాత్మక క్షేత్రస్థాయి అభ్యాసాలు, నైతిక విలువలు పెంపొదించడంలో పీటీసీ నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాం. పోలీస్‌ దళ నిర్మాణానికి పునాదిగా పీటీసీని తీర్చిదిద్దాం. నిరంతర సవాళ్లను దీటుగా ఎదుర్కోనేలా శిక్షణ ఇవ్వడం పీటీసీ ప్రత్యేకత. 473 మంది మహిళా శిక్షణార్థులు తొమ్మిది నెలల పాటూ అద్భుతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

– దంతులూరు రామచంద్రరాజు,

పీటీసీ ప్రిన్సిపాల్‌, విజయనగరం

పోలీసు దళ

నిర్మాణానికి పునాదిగా పీటీసీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement