జాతీయస్థాయి పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయులు

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

‘ఆడ పిల్లల రక్షణ’పై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

సీతంపేట: ఇటీవల తణుకులో జరిగిన 44వ రాష్ట్రస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు ఐదుగురు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో ఆయా ఉపాధ్యాయులను పాలకొండ సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ శనివారం అభినందించారు. జావెలిన్‌ త్రో, డిస్క్‌ త్రో, 5 కిలోమీటర్ల వాక్‌, షాట్‌ఫుట్‌, హైజంప్‌, తదితర పోటీల్లో 17 పతకాలు సాధించారు. వచ్చేనెలలో కోయంబత్తూరులో జరగబోయే జాతీయస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో కూడా ప్రతిభ కనబరచాలని పీఓ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డీడీ అన్నదొర, తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: ఆడపిల్లల రక్షణపై సమాజంలో అవగాహన పెంచే లక్ష్యంతో జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 11న నిర్వహించనున్న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భ్రూణ హత్యలను నిరోధిద్దాం – ఆడపిల్లను కాపాడుకుందాం’ అనే ఇతివృత్తంతో పాటు ‘పీసీ అండ్‌ పీఎన్డీటీ’ చట్టంపై ఈ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తూనే, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉన్నత విద్యాశాఖ సమన్వయంతో సెప్టెంబర్‌ నెలాఖరు కల్లా ఈ పోటీలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ మొదటి వారంలో విజేతలను ఎంపిక చేసి, బాలికా దినోత్సవం రోజున కలెక్టర్‌ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు.

విజయనగరం టౌన్‌: అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి టూటౌన్‌ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కుమిలి గెడ్డవీధికి చెందిన చుక్క అప్పన్న (41) మద్యానికి బానిసై, ఫిట్స్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల కిందట భార్యతో గొడవ పడడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి విజయవాడ వెళ్లిపోయింది. దీంతో మరింతగా తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అప్పన్న తిరిగి ఇంటికి చేరుకోలేదు. స్థానిక కోట్లమాదప్ప వీధి సందు వద్ద మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. అతిగా మద్యం సేవించడంతో పాటు ఫిట్స్‌ రావడం వల్ల మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement