● చివరిరోజు పార్టీకి, పదవులకు రాజీనామా
● నవ్వుకుంటున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి,విజయనగరం: ఓ నలుగురు జెడ్పీటీసీలు తమ పదవీకాలం ముగుస్తున్న చివరి క్షణంలో రాజీనామాలు చేయడం చూస్తున్న ప్రజలు విస్తుపోతున్నారు. బుధవారంతో జిల్లాలోని మండల పరిషత్ చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు సారథ్యంలోని జిల్లా పరిషత్ కాల పరిమితి గురువారం ముగుస్తోంది. అయితే జెడ్పీటీసీల్లో గార తవుడు (గజపతినగరం) వలిరెడ్డి శిరీష (చీపురుపల్లి), వర్రి నరసింహ మూర్తి(గంట్యాడ), నెక్కల శ్రీదేవి(కొత్తవలస) తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే అన్నట్లుగా వీరు రాజీనామా చేసినా, చేయకున్నా మరో పూటలో వారి పదవీ కాలం ముగుస్తోంది. ఎలాగూ మాజీలు కాక తప్పదు..మరి అలాంటప్పుడు రాజీనామా పేరిట రాజీ డ్రామాలు ఎందుకు అనే ప్రశ్నలు ప్రజలనుంచి వస్తున్నాయి. తమను తాము మార్కెటింగ్ చేసుకోవడానికి, తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఇలా ప్రజలను మభ్యపెడుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ నలుగురు జెడ్పీటీసీలు ప్రజాబలం, సొంత బలంతో గెలిచారనే దానికన్నా వైఎస్సారే కాంగ్రెస్ పార్టీ మద్దతు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్‌తోనే గెలిచారన్నది అందరికీ తెలిసిందే. కానీ ఐదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక తమ నిజరూపం చూపించుకుకున్నారని, అవకాశవాదంతో రాజీనామాలు చేస్తున్నారని ప్రజలే విమర్శిస్తున్నారు. అధికా రం ఉన్నన్నాళ్లు ఇక్కడ.. అవకాశం దొరకగానే అక్కడ అన్నట్లుగా వ్యవహరిస్తున్న వీళ్ల తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఖరీఫ్‌లో శతశాతం సాగయ్యేలా చూడాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్‌లో ఎక్కడా సాగు విస్తీర్ణం తగ్గకుండా చూడాలని, వరిస్థానంలో ఉద్యాన పంటలు, కూరగాయాలు లేదా అపరాలు తదితర పంటలు శతశాతం సాగయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆన్‌లైన్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడా పంట లేకుండా భూమిని ఖాళీగా ఉంచకూడదన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలకు ఎంతో అనుకూలత ఉందని దానిని వినియోగించుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై దృష్టి పెట్టాలన్నారు. ఖరీఫ్‌కు, రబీకి మధ్య సాగు విస్తీర్ణంలో తేడా ఎక్కువగా ఉంటుందని, వచ్చే రబీలో ఈతేడా తగ్గించి ప్రకృతి సేద్యం ద్వారా ఖరీఫ్‌కు దీటుగా సాగు జరిగేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలోజిల్లా వ్యవసాయ అధికారి ఎం. రామారావు, పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ మన్మథరావు, ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


