తోటపల్లి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

తోటపల్లి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

తోటపల్లి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి

సీతానగరం: మండలంలోని ఏగోటివలస వద్ద తోటపల్లి కాలువలో గల్లంతైన కృష్ణా జిల్లా లెంక గ్రామానికి చెందిన మధుకోటి హేమంత్‌ కృష్ణ (39) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. హేమంత్‌ కృష్ణ ఓ శుభకార్యం నిమిత్తం మండలంలోని ఏగోటివలస బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు స్నేహితులు ఎస్‌. పోలినాయుడు, తదితరులతో కలిసి కాలువ వద్దకు వచ్చిన హేమంత్‌ కృష్ణ ప్రమాదవశాత్తూ నీటిలో పడి గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న తహసీల్దార్‌ కె. ప్రసన్నకుమార్‌ పోలీసులు, అగ్నిమాపక, ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆయా శాఖల పర్యవేక్షణలో మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పాటు చీకటి నెలకొనడంతో గాలింపు కష్టమైంది. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా.. బురదలో కూరుకుపోయిన హేమంత్‌ కృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. విజయవాడ నుంచి వచ్చిన హేమంత్‌కృష్ణ బంధువుల సమక్షంలో శవ పంచనామ చేపట్టి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.హేమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నీటిలో పడి వ్యక్తి..

శృంగవరపుకోట: మండలంలోని వెంకటరమణపేట గ్రామానికి చెందిన మజ్జి మహేష్‌ (38) అనే వ్యక్తి నీటిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌.కోట పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటరమణపేటకు చెందిన మజ్జి మహేష్‌ ట్రాక్టర్‌ నడుపుతూ జీవిస్తుంటాడు. ప్రతిరోజూలాగే సోమవారం ఉదయం కూడా డ్రైవింగ్‌కు వెళ్తానని వాళ్ల అమ్మకు చెప్పిన బయటకు వెళ్లిన మహేష్‌ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఇదిలా ఉంటే వెంకటరమణపేట జంక్షన్‌లోని శివాలయం దగ్గరలో ఉన్న కోనేరులో మృతదేహం తేలి ఉండడాన్ని బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మజ్జి మహేష్‌గా గుర్తించారు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ కోనేరులో పడి చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి భార్య మజ్జి అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాలువలో పడి యువకుడు..

చీపురుపల్లి రూరల్‌ (గరివిడి): కాలువలో పడి యవకుడు మృతి చెందిన సంఘటన గరివిడి పట్టణంలోని కొండపాలెం ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జమ్ము కల్యాణ్‌ (20) ఇంటి సమీపంలోని కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు.. కల్యాణ్‌ మద్యం మత్తులో కాలువలో పడిపోయినట్లు సమాచారం. ముఖం కాలువలోకి, కాళ్లు బయటకు ఉన్న స్థితిలో యువకుడ్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడ్ని బయటకు తీసి చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి తల్లి జ్యోతి ఒక్కరే ఉన్నారు. ఆదుకోవాల్సిన కుమారుడి మృతితో తల్లి కన్నీరమున్నీరుగా విలపిస్తున్నారు.

గడ్డిమందు తాగి..

వంగర: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన కొత్తపల్లి గణపతి (52) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 22న గడ్డి మందు తాగేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న గణపతిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై యందవ పైడితల్లి తెలిపారు. మృతుడి భార్య పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement