● ఎస్పీ ఏఆర్ దామోదర్
పూసపాటిరేగ: తుఫాన్ కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి 60–70 కి.మీ.లకు పైబడి గాలులు వీస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. భారీ వర్షాలతో ప్రభావితమైన భోగాపురం, పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీరప్రాంత గ్రామాలను బుధవారం ఎస్పీ సందర్శించి, ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప తుఫాన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నందున అధికారుల సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు. పోలీసుశాఖ పరంగా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. తీర ప్రాంత గ్రామాలను ఇప్పటికే అప్రమత్తం చేశామని, విపత్తులను ఎదుర్కొనేందుకు మైరెన్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచామని, ఎవరూ అభద్రతాభావానికి గురికావాల్సిన పని లేదన్న భరోసాను ప్రజలకు ఎస్పీ కల్పించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాల ప్రభావం రెండు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తమ విలువైన వస్తువులను భద్రపర్చుకోవాలని ఎస్పీ సూచించారు.
ముందుగా ఎస్పీ దామోదర్ డెంకాడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, ఇన్‌చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్సైలతో సమావేశమై, వర్షాల వల్ల తీరప్రాంత గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు, పోలీసుశాఖ చేపట్టిన రక్షణ చర్యలను సమీక్షించారు. అనంతరం ఇతర పోలీసు అధికారులతో కలిసి పూసపాటిరేగ మండలంలోని తమ్మయ్యపాలెం గ్రామం, భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామాలతోపాటు మరికొన్ని తీరప్రాంత గ్రామాలను సందర్శించి, భారీ వర్షాల ప్రభావాన్ని పరిశీలించి, స్థానిక ప్రజలు, మత్స్యకారులతో మమేకమయ్యారు.
ఆయన వెంట డీఎస్పీ ఎస్.రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, పలువురు ఎస్సైలు, ఇతర పోలీస్ అధికారులు, మైరెన్ పోలీసులు, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.


