విచారణ జరుగుతోంది | - | Sakshi
Sakshi News home page

విచారణ జరుగుతోంది

Jun 7 2026 12:27 AM | Updated on Jun 7 2026 12:27 AM

విజయనగరం మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. రామభద్రపురంలో మేట్‌లు రూ.100 అడుగుతున్న అంశంపై కూడా విచారణకు ఆదేశించాం. వేతనదారుల్లో కూడా మార్పు రావాలి. పనిచేసిన దానికి సంబంధించి వేతనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలాంటిప్పుడు డబ్బులు తిరిగి ఎందుకు ఇవ్వాలని వేతనదారులు ప్రశ్నించాలి. అప్పుడే పూర్తి స్థాయిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయగలం.

– ఎస్‌.శారదాదేవి, పీడీ, డ్వామా

బినామీ మస్తర్లతో ఉపాధిహామీ నిధుల దోపిడీ

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు శూన్యం

విచారణ పేరుతో సాగదీత అధికార బలంతో నిధుల కై ంకర్యం

ముఖ ఆధారిత హాజరు ప్రవేశపెట్టినా ఆగని ఆక్రమాలు

విజయనగరం ఫోర్ట్‌:

థకం ఏదైనా ‘అధికార’ బలంతో నిధులు కొల్లగొడుతున్నారు. జేబులు నింపుకుంటున్నారు. అవినీతి, అక్రమాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రెండేళ్లుగా ఉపాధిహామీ పథకంలో అక్రమాలు కో కొల్లలుగా కనిపిస్తున్నా చర్యలు శూన్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్లు వేసి వేతనదారుల నుంచి అక్రమవసూళ్లు, పనిచేయకుండానే చేసినట్టు రికార్డుల్లో ఏమార్చి నిధులు పెద్దమొత్తంలో కై ంక్యర్యం చేయడం పరిపాటిగా మారింది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న’ సామెత చందాన అధికార పార్టీ నాయకులు ఉపాధిహామీ నిధులతో దోచుకునే పనిలో పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరికి కొందరు అధికారులు సైతం సాయంచేస్తూ వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ ఆధారిత హాజరును తప్పనిరిసరి చేసినా వివిధ సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని నిధులు కాజేస్తుండడం ఉన్నతాధికారులను కలవరపెడుతోంది.

పని కల్పించేందుకు చేయి తడపాల్సిందే...

ఉపాధి హామీ పథకంలో పని అడిగిన ప్రతీ ఒక్కరికి పని కల్పిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, ఉపాధి హామీ పథకం మేట్‌ (మేసీ్త్ర)ల ద్వారా వేతనదారుల నుంచి పని కల్పించడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. మేట్‌లు అడిగినంత ఇవ్వకపోతే పని కల్పించమని చెప్పడంతో చేసేది లేక వేతనదారులు అడిగినంత ముట్టజెపుతున్నారు. చాలాచోట్ల ఒక్కో వేతనదారు నుంచి వారానికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే రేపటి నుంచి పని కావాలంటే ఇవ్వు.. లేదంటే మానేయ్‌ అన్న సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాచోట్ల పాత మేట్‌లను తొలగించి అధికారపార్టీకు అనుకూలంగా ఉన్నవారిని నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి.

సిబ్బంది సహకారంతోనే..

అధికార పార్టీ నాయకుల దోపిడీకి కొందరు ఉపాధిహామీ సిబ్బంది సహకరిస్తున్నట్టు సమాచారం. బినామీ మస్తర్లు వేయడం, వేతనదారుల ఖాతాల్లో జమైన డబ్బులను తిరిగి తీసుకుని కొందరు అధికారులు, పాలకులు పంచుకుంటున్నారన్న చర్చ జిల్లాలో జోరందుకుంది. అధికార పార్టీ వారు కావడంతో చేసేది లేక ఉపాధి హామీ సిబ్బంది కూడా తలాడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులకు మస్తర్లు వేయాలని కొన్నిచోట్ల ఒత్తిడి వస్తున్నట్టు డ్వామాకు చెందిన ఓ అధికారి సైతం చెప్పడం గమనార్హం.

రామభద్రపురం మండలంలో ఉపాధి పని కల్పించడానికి మేట్‌లు వారానికి ఒక్కో వేతనదారుడి నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్టు ఆరోప ణలు ఉన్నాయి. విచారణలో అంతా సక్రమమే అంటూ అధికారులు తేల్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయనగరం మండలంలో కూడా మస్తర్‌ వేయడానికి ఒక్కో వేతనదారుడు నుంచి వారానికి రూ.100 చొప్పన వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఒక ఏపీఓ రూ.58 లక్షల వరకు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో అతనిపై విచారణకు ఆ శాఖ అధికారులు ఆదేశించారు. రెండేళ్లవుతున్నా ఆయనపై చర్యలు లేవు. విచారణ సా...గుతూనే ఉండడంపై ఆ శాఖలోనే చర్చసాగుతోంది.

విజయనగరం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో సుమారుగా రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఉపాధి హామీ ఉన్నతాధికారులకు ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఫిర్యాదు చేశారు. సుమారు 8 నెలలు అవుతున్నా చర్యలు శూన్యం.

Advertisement
 
Advertisement
Advertisement