రాజుల పాలనలో పేదలకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

రాజుల పాలనలో పేదలకు కష్టాలు

Jun 7 2026 12:27 AM | Updated on Jun 7 2026 12:27 AM

బొబ్బిలిరూరల్‌:

బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల పైత్యం పెచ్చుమీరుతోంది. మూడుపూటలూ తిండికి లేక, నిస్సహాయులైన నిరుపేద గిరిజన కుటుంబాలపై జలుం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ కక్షతో ఏళ్లతరబడి నివాసముంటున్న పూరిపాకలను ఖాళీ చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇటీవల బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో పూజారి రాపాక జోగినాయుడు కుటుంబం పంచాయతీ స్థలంలో నివసిస్తోందంటూ గెంటే యత్నం చేయగా, ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా కాశిందొరవలస పంచాయతీ డొంగురువలసలో అలాంటి దుశ్చర్యకు మళ్లీ పూనుకున్నారు. గ్రామంలో గెడ్డ పోరంబోకు స్థలంలో చిన్న పూరిపాకను వేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఎన్నికల కళ్యాణ్‌, సీతపై వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులన్న ముద్రవేసి కక్షసాధింపులకు దిగారు. గెడ్డపోరంబోకు స్థలంలో అక్రమంగా పూరిపాక వేసుకున్నారని, దానిని తొలగించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నేతతో ఒత్తిడి చేయించారు. ఆర్డీఓ ఆక్రమణను సీరియస్‌గా తీసుకుని వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలని, వారికి నోటీసులు పంపాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆ మేరకు శనివారం ఆర్‌ఐ రామకుమార్‌, వీఆర్వో సుధాకర్‌, పోలీసులు అక్కడకు చేరుకుని పూరిపాకను తొలగించాలంటూ నిరుపేదకుటుంబానికి నోటీసులిచ్చారు. రెండు రోజుల్లో ఖాళీ చేయకుంటే తామే పూరిల్లును కూల్చేస్తామని, బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని కళ్యాణ్‌ భార్య సీతకు నోటీసులిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమయం ఇవ్వలేమని, వెంటనే ఖాళీ చేయాల్సిందేనని హుకుంజారీచేశారు. దీంతో బాధిత కుటుంబం గగ్గోలుపెడుతోంది. ఉన్నఫలంగా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తల్లడిల్లుతోంది. అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు... ఇప్పుడు పేదలపై ప్రతాపం చూపుతున్నారని, సభ్యసమాజం తలదించుకునే పనులకు పూనుకుంటున్నారంటూ గ్రామస్తులు పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డుపక్కన చాలా పూరిపాకలు, పశువుల శాలలు ఉండగా కేవలం గిరిజన కుటుంబం పూరిపాకనే ఖాళీ చేయాలని ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బొబ్బిలిలో అరాచక పాలన..

బొబ్బిలిలో రెండేళ్లుగా అరాచక పాలన సాగుతోంది. అధికార బలంతో పదవులను లాక్కోవడమే కాదు పేద గిరిజనులు సాగుచేస్తున్న భూములను దౌర్జన్యంగా కాజేస్తున్నారు. వారి ఇళ్లను కూలదోస్తున్నారు. పథకాలు అందకుండా చేస్తున్నారు. రాజరికం కాదు మాది రాక్షసపాలన అంటూ చేతల్లో చూపిస్తుండడంపై బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. పేదలను ఆదుకోవాల్సిన చేతులు కష్టాలపాలచేస్తుండడంపై జనం మండిపడుతున్నారు. కోటలు చూసి మురిసిపోవడం కాదని... పేదల కష్టాలు చూడాలని, వారిపై కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవుపలుకుతున్నారు. వీరు పూర్వీకుల వలే రాజులు కాదు.. రాక్షసులంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.

నిరుపేద కుటుంబానికి నిలువ నీడలేకుండా

గెంటే యత్నం

పూరిపాకను కూల్చివేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

రెవెన్యూ అధికారుల నోటీసుతో ఆందోళనలో గిరిజన కుటుంబం

తిండికి లేనివారం రాజకీయాలు చేయగలమా అంటూ నిట్టూర్పు

ఆదుకోవాలంటూ వేడుకోలు

డొంగురువలసలో పూరిపాక ఖాళీచేయాలని గిరిజనురాలిని హెచ్చరిస్తున్న ఆర్‌ఐ రామకుమార్‌, సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement