విజయనగరం అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026ను పురస్కరించుకొని జిల్లాలో ఈ నెల 21న చేపడుతున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 6.45 నుంచి 7.30 గంటల వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ/వార్డు సచివాలయాల్లో యోగా శిక్షణా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 14న 500 మంది ఉపాధి హామీ వేతనదారులతో ‘థిమేటిక్ యోగా’, 18, 20 తేదీల్లో రామనారాయణం, చింతపల్లి బీచ్ వద్ద 500 మందితో ‘టూరిజం యోగా’, జిల్లాలోని 6 ప్రముఖ దేవాలయాల్లో ‘టెంపుల్ యోగా’ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం రాజీవ్ స్టేడియంలో మూడు వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలతో భారీ ఎత్తున ‘మెగా యోగా’ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9న గ్రామస్థాయి, 10న మండల స్థాయి, 14న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తామని, విజేతలు ఈ నెల 18న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని, జిల్లా ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో డిజిటల్ నమోదు చేసుకొని యోగాంధ్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.
విలువ ఆధారిత ఉత్పత్తులతో ఆదాయం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: రైతులు పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ఆదాయం పొందాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి–సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం కింద ఏర్పాటుచేసే యూనిట్లకు 10 శాతం అర్జీదారుడు పెట్టుబడితే బ్యాంకుల నుంచి మిగిలిన 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. రూ.10 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయితీ అందుతుందన్నారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి, కనీస విద్యార్హత కలిగిన వ్యక్తులు, సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 547 యూనిట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. 1100 మంది చెరకు రైతులకు రూ.1.58 కోట్ల రుణం మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా సమాఖ్యలను ప్రోత్సహించాలన్నారు. సంఘాల వద్దకే అధికారులు వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఉద్యానశాఖాధికారి కె.చిట్టిబాబు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, మెప్మా పీడీ జి.వి.చిట్టిరాజు, తదితరులు పాల్గొన్నారు.


