అక్కడ రూ.21,500.. ఇక్కడ రూ.15 వేలు.. | - | Sakshi
Sakshi News home page

అక్కడ రూ.21,500.. ఇక్కడ రూ.15 వేలు..

Jun 7 2026 12:27 AM | Updated on Jun 7 2026 12:27 AM

● సర్వజన ఆస్పత్రి ఈసీజీ టెక్నీషియన్ల ఆవేదన

● మిగతా జిల్లాలో కంటే వీరికి తక్కువ జీతం

చెల్లిస్తున్న వైద్యాధికారులు

● ప్రతినెలా రూ.6,500 చొప్పున నష్టపోయే పరిస్థితి

విజయనగరం ఫోర్ట్‌: రోగుల గుండెలో ఉన్న లోపాలను ఈసీజీ తీసి నిర్ధారించే టెక్నీషియన్లను వేతన వ్యత్యాసం ఆవేదన కలిగిస్తోంది. వారి వేతన కష్టాలు తీర్చే నాథుడే కరువయ్యాడు. న్యాయం చేయాలంటూ ఆస్పత్రి అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం శూన్యమే. రాష్ట్రంలోని మిగతా జిల్లాలో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లు అందరికీ ఒకలా జీతం వస్తే, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఆస్పత్రి పరిధిలోని ఘోషా ఆస్పత్రిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లకు మాత్రం మరోలా జీతం రావడం గమనార్హం. వాస్తవంగా అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లకు రూ.21,500 జీతం చెల్లించాలి. రాష్ట్రంలో విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను రూ.21,500 చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సర్వజన, ఘోషాస్పత్రిల్లో పనిచేస్తున్న ఈసీజీ టెక్నీషియన్లకు మాత్రం రూ.15 వేలు చెల్లిస్తున్నారు. నెలకు రూ.6,500 చొప్పున ఏడాదికి రూ.78వేలు నష్టపోతున్నారు. దీనిపై ఆస్పత్రి అధికారులను ప్రశ్నించినా ఫలితం కనిపించడం లేదు.

ప్రతిపాదనలు పంపించాం

ఈసీజీ టెక్నీషియన్లకు మిగతా జిల్లాలో కంటే తక్కువ జీతం వస్తున్నమాట వాస్తవమే. వీరికి కూడా రూ.21,500 జీతం చెల్లించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే వీరికి కూడా వేతనం పెరుగుతుంది.

– డాక్టర్‌ అల్లు పద్మజ, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

Advertisement
 
Advertisement
Advertisement