శృంగవరపుకోట: మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు ప్రతిపాదించిన జిందాల్ భూములను శనివారం ఏపీఐఐసీసీ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్‌కుమార్, జెడ్‌ఎం కృష్ణప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. జిందాల్ భూముల వెనుకున్న ట్రస్టు గురించి ఆరా తీయగా అది పార్కు బయట ఉందని స్థానిక అధికారులు చెప్పారు. మాస్టర్‌ప్రింట్‌లో ముందుగా 150 ఎకరాలు మార్కింగ్ చేయాలని సూచించారు. భూ విస్తరణ, నీటి వనరుల లభ్యత, తాటిపూడి రిజర్వాయర్ ఎంత దూరంలో ఉంది వంటి వివరాలపై ఆరా తీశారు. జిందాల్ ప్రతినిధులు విక్టర్, శివారెడ్డిలు మోడల్ ప్రాజెక్టు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్‌ఫేజ్‌లో 550ఎకరాలు అభివృద్ధి చేశామని, ఇప్పటికే రోడ్లు, కాలువలు, ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశామన్నారు. 540ఎకరాలు, మరో ప్యాచ్‌లో 160 ఎకరాలు మొత్తంగా 700 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించామని, ఐదు ప్రాంతాల్లో మొత్తం జిందాల్ భూములు 1166 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. తహసీల్దార్ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపాదిత ఎంఎస్‌ఎంఈ పార్కుకు ఒకవైపు 516బి విశాఖ–అరుకు హైవే, మరోవైపు 516ఇ విజయనగరం–అరుకు హైవేలు ఉన్నాయని చెప్పారు. తిరిగివెళ్తున్న సమయంలో ఎం.డి.దినేష్‌కుమార్ సీఎం ప్రొగ్రాం ఎప్పుడు ఫిక్స్ చేశారని అడగ్గా, జిందాల్ ప్రతినిధి విక్టర్ స్పందిస్తూ ‘సార్ వస్తామన్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు’ అంటూ బదులిచ్చారు. ఈ నెల మూడవ వారంలో ముఖ్యమంత్రి జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుకు భూమిపూజ చేసేందుకు వస్తారని రెవెన్యూ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పార్క్ భూములు ఎలా ఉన్నాయి.. ఎక్కడున్నాయి.. ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న వ్యూహరచన కోసమే అధికారుల పరిశీలనల హడావిడి అన్న ప్రచారం సాగుతోంది.
ఏడాది గోడు గాలికేనా?
ఏడాది కాలంగా జిందాల్ నిర్వాసితులు చేస్తున్న పోరాటాలు, వారి గోడు గాలికేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిందాల్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానంటూ రాష్ట్రహోంమంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన హామీ మట్టిలో కలిసిపోయినట్టేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇటీవల ఇచ్చిన భరోసా కూడా నీటిమూటగానే మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్వాసితులను ఆదుకునే పరిస్థితి కనిపించడంలేదన్న వాదన వినిపిస్తోంది.


