మేము నిరుపేదలం... మా ఇల్లు చూడండి.. కూలి చేస్తేగానీ కడుపునిండదు.. మేము రాజకీయాలు చేయగలమా?.. మాపై వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమంటూ రాజకీయ ముద్రవేశారు. రోడ్డు పక్కన చిన్నస్థలంలో పూరిపాక వేసుకుని తొమ్మిదేళ్లుగా ఇద్దరు పిల్లలతో జీవిస్తుంటే ఇప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసి ఖాళీ చేయిస్తున్నారు. ఇది న్యాయమేనా.. ఇదెక్కడి ఘోరమయ్యా.. పేదలం ఎలా బతకాలయ్యా.. గూడుకు చోటుకూడా కరువేనా?.. ఇక్కడేమైనా ఆఫీసులు కడతారా?.. అంటూ బాధితురాలు ఎన్నికల సీత విలేకరుల ముందు వాపోయింది. తమ కష్టాల జీవనాన్ని చెబుతూ విలపించింది. నిరుపేద గిరిజన కుటుంబాన్ని గ్రామబహిష్కరణకు పూనుకోవడం సరికాదంటూ వాపోయింది. ఇప్పటికిప్పుడు ఎక్కడకు పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి గూడు చూపాక ఖాళీచేయించాలంటూ ప్రాథేయపడింది.


