● చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి
● 45 గ్రామాల్లో మొత్తం 169 మంది బాధితులు
● ఒక్క ఒమ్మి గ్రామంలోనే 69 కేసులు
● ప్రజల్లో కొరవడిన అవగాహన
నెల్లిమర్ల రూరల్: ఒకప్పుడు అరుదుగా కనిపించే ఫైలేరియా వ్యాధి ఇప్పుడు నెల్లిమర్ల మండలంలో ఆందోళన కలిగించే స్థాయిలో కొనసాగుతోంది. వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం మండలంలోని 45 గ్రామాల్లో ప్రస్తుతం 169 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. ముఖ్యంగా ఒమ్మి గ్రామంలోనే 69 మంది బాధితులు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రజారోగ్య వ్యవస్థతో పాటు గ్రామీణ పారిశుద్ధ్య పరిస్థితులపై ఈ గణాంకాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
రెండు పీహెచ్‌సీల పరిధిలో బాధితులు ఇలా
మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండగా..సతివాడ పీహెచ్‌సీ పరిధిలోని 31 గ్రామాల్లో 149 ఫైలేరియా కేసులు ప్రస్తుతం ఉన్నాయి. అందులో ఒమ్మిలో అత్యధికంగా 69 మంది బాధితులుండగా, సతివాడలో 21 మంది, మిగిలిన 28 గ్రామాల్లో 59 మంది బాధితులు ఉన్నారు. కొండవెలగాడ పీహెచ్‌సీ పరిధిలోని 15 గ్రామాల్లో మరో 20 కేసులు ఉన్నాయి. అందులో కొండవెలగాడలోనే 11 మంది బాధితులు ఉండడం గమనార్హం.
ప్రజల్లో కొరవడిన అవగాహన
ఫైలేరియా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వ్యాధి శరీరంలోని లింఫ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మొదట్లో సాధారణ జ్వరం, వాపు వంటి లక్షణాలు కనిపించినా, క్రమంగా కాళ్లు, చేతులు లేదా ఇతర అవయవాలు అసాధారణంగా వాపుగా మారతాయి. వ్యాధి తీవ్రమైతే బాధితులు జీవితాంతం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇన్ని కేసులు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అవగాహన కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు
గ్రామాల్లో తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారనే విమర్శలు ప్రజల నుంచే వినిపించడం గమనార్హం. వాస్తవానికి ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ విధానం అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగునీటి పైపు లైన్ల వద్ద లీకులను అరికట్టకపోవడంతో ఆ నీరే మురుగుగా మారే పరిస్థితి ఉంది. ప్రజల సహకారం కూడా లేకపోవడం వ్యాధి వ్యాప్తికి మరో కారణంగా తెలుస్తోంది. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం, కాలువలను ఆక్రమించి భవనాలు కట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దోమల సంతతి పెరిగి రోగాలకు కారణమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యం కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఎంపీపీ చొరవతో ప్రైవేట్ కంపెనీ సేవలు:
ఒమ్మి గ్రామంలో వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ఏంఎసీ మాజీ చైర్మన్ శ్రీరాములు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. జర్మనీకి చెందిన కంపెనీ ప్రతినిధులను సంప్రదించడంతో వారు మూడేళ్లుగా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు కూడా గతంలో వ్యాధి తీవ్రతపై ఎన్నో అధ్యయనాలు చేశారు. దోమ తెరలు, దోమలను ఆకర్షించే అధునాతన బుట్టలు ఇంటింటీకీ పంపిణీ చేశారు. కాలువల వద్ద దోమల నియంత్రణకు ఫాగింగ్ చర్యలు కొంత కాలం పాటు నిర్వహించారు.
కలెక్టరేట్‌లో ఫిర్యాదుతో ఫైలేరియా పరీక్షలు:
ఇటీవల ఒమ్మి గ్రామానికి చెందిన పలువురు.. ఫైలేరియా వ్యాధి విజృంభణపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉందని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఉన్నతాధికారుల స్పందనతో ఎన్‌ఎఫ్‌సీపీ యూనిట్ జిల్లా అర్బన్ రూరల్ బృందాలు ముమ్మరంగా రక్త నమూనాల సేకరణ చేపట్టారు. సుమారు 400 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.


