విజయనగరం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీ రావు చెప్పిన వివరాల ప్రకారం...ప్లాట్ ఫాంలపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ లు తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం పాత హుబ్లీ, ధర్వాద్ జిల్లాలకు చెందిన అఖిలేష్ యార్మశల్, షబాజ్ రఫీ అమ్మద్ ఖాతిబ్‌లు ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచీ పది కేజీలు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ప్లాట్ ఫాం లపై తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బందిని చూసి వారు కంగారు పడటంతో జీఆర్పీ ఎస్సై బాలాజీరావుకు అనుమానం వచ్చి ఆర్పీఎఫ్ సిబ్బందితో ఇద్దరి వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్ట్ కు తరలించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు.
లారీ బోల్తా
● త్రుటిలో తప్పిన ప్రమాదం
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పెదమేరంగి కూడలి సమీపాన గల గౌరవంపేట మలుపు వద్ద మామిడి పండ్లతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. శనివారం ఉదయం విజయనగరం నుంచి ఒడిశా మీదుగా ఢిల్లీ వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి అదుపుతప్పింది. దీంతో అటువైపు వస్తున్న ప్రయాణికులు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని స్థానికులు తెలిపారు.
పిడుగు పడి ఆవు మృతి
జామి: మండల కేంద్రమైన జామిలో పిడుగుపడి ఆవు మృతి చెందింది. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద్ద వర్రి వాని కళ్లాల వద్ద శనివారం మధ్యాహ్నం పిడుగుపడి రైతు కె. పరసన్న ఆవు మృతిచెందింది. పశువైద్యాధికారి సంతోష్‌కుమమార్ మృతి చెందిన ఆవును పరిశీలించారు. సుమారు రూ. 60వేలు ఖరీదు అయిన ఆవు మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
అప్పు తీసుకున్న వ్యక్తి పరారీ
బొండపల్లి: మండలంలోని బి.రాజేరు గ్రామానికి చెందిన బండారు వెంకటేష్ తన ఇద్దరు కూతుళ్ల వద్ద నుంచి అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వకుండా పరారీ అయినట్లు అంబటివలస గ్రామానికి చెందిన నరవ సత్యం వాపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బి.రాజేరు గ్రామానికి చెందిన వెంకటేష్ అదే గ్రామానికి చెవిన ఇసినిగిరి బంగారమ్మ, ధర్మవరపు పార్వతిల నుంచి నాలుగు లక్షల రుపాయలు అప్పుగా తీసుకుని గ్రామం నుంచి పరారీ అయ్యాడు. వెంకటేష్ మామ గ్రామంలోనే ఉన్నా, తనకు అప్పుకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నాడని, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా అప్పు తీసుకున్న వ్యక్తి ఆచూకీ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారని నరవ సత్యం చెప్పాడు. తన కూతుళ్ల వద్ద తీసుకున్న అప్పుకు గ్రామంలో గానీ, పోలీసుల వద్ద గానీ ఎటువంటి న్యాయం జరగలేదని న్యాయం చేసేలా చూడాలని కోరాడు.


