● ఏపీఐఐసీ అధికారులకు ఎం.డి దినేష్ కుమార్ ఆదేశాలు
బొబ్బిలి: స్థానిక గ్రోత్‌సెంటర్‌లోని భూములను ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామమోహన రావు, ఏపీఐఐసీ అధికారులతో ఆయన మాట్లాడుతూ ఎన్ని పరిశ్రమలున్నాయి? ఎంతమందికి భూములు కేటాయించారన్న వివరాలను నోట్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం భూములను తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆర్‌వీఆర్ పరిశ్రమలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ ఏపీఐఐసీకి సంబంధించి ఎవరూ ఉండడం లేదని, సమస్యలు తెలుపుకునేందుకు శ్రీకాకుళం, విజయనగరం వెళ్లాల్సి వస్తోందని పారిశ్రామిక వేత్తలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నీరు, విద్యుత్ సమస్య ఉందని వాపోయారు. వెంటనే ఆర్డీఓ రామమోహన రావుతో ఎం.డి మాట్లాడుతూ ఇక్కడ తహసీల్దార్ స్థాయి అధికారిని స్పెషలాఫీసర్‌గా నియించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇలా వచ్చి అలా వెళ్లపోతారా?
ఏపీఐఐసీ ఎం.డి లాంటి అధికారి ఎన్నో సమస్యలున్న గ్రోత్ సెంటర్‌కు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, మండల కార్యదర్శి సింగిరెడ్డి గోపాలం విమర్శించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్థానిక గ్రోత్‌సెంటర్‌లో కార్మికులకు తాగునీరు లేక, పరిశ్రమలకు విద్యుత్, నీటి వసతి, రోడ్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఎవరిని కలిసి వినతిపత్రం ఇద్దామన్నా ఎవరూ లేని పరిస్థితుల్లో ఎం.డి వచ్చి వెంటనే వెళ్లిపోవడం, కనీసం మీడియాకు కూడా సమాచారం లేకపోవడం దారుణమన్నారు.


