చీపురుపల్లి: దాదాపు రూ.25 కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం అటువైపు చూడడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నప్పటికీ రికార్డులు చూస్తున్నారు తప్ప భూముల పరిరక్షణను పట్టించుకోవడం లేదు. బహుశా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదనేనేమో భీమిలికి చెందిన ఓ కింగ్ ఆ ప్రభుత్వ భూముల్లో గెస్ట్‌హౌస్, ప్రహరీ, గేటు ఏర్పాటు చేసి రైతులను పంట పొలాలకు సైతం వెళ్లనీయకుండా అడ్డంగా గోడ నిర్మాణం చేశాడు. కర్లాం రెవెన్యూ పరిధిలో 87.34 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఇంత జరుగుతున్నా గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎవరూ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు విపిస్తున్నాయి. సదరు కింగ్ వెనుక అధికార టీడీపీలోని ఓ పెద్ద తలకాయ అండదండలు ఉండడంతోనే రెవెన్యూ యంత్రాంగం అటు వైపు చూడడం లేదనే చర్చ బహిరంగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎంఎస్‌ఏంఈ పార్కుల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున భూములు సేకరించింది కానీ ఇక్కడ 87.34 ఎకరాలు మాత్రం రెవెన్యూ యంత్రాంగానికి కనిపించకపోవడం వెనుక ఆ పెద్ద తలకాయ అండదండలే కారణమని చర్చ జరుగుతోంది.
సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాల
ప్రభుత్వ భూమి
చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం గయాలు భూమిగా పేర్కొన్నారు. ఆ భూములకు సంబంధించి గతంలో ఎలాంటి పట్టాలు మంజూరు చేయలేదు. రికార్డుల్లో 87.34 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ భూములు మాత్రం వేరే వ్యక్తుల చేతుల్లో ఉండడం గమనార్హం.
పంట పొలాలకు వెళ్లకుండా గోడ నిర్మాణం
మండలంలోని కర్లాం, నిమ్మలవలస, మోదుగులపేట తదితర గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. దీంతో వ్యవసాయ భూములు సైతం కలిసే ఉంటాయి. వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఈ మూడు గ్రామాల రైతులు సర్వే నంబర్ 408 లో నుంచే వెళ్లి వస్తుంటారు. అయితే ఈ భూముల్లో నుంచి రైతులను వెళ్లనివ్వకుండా సదరు కింగ్ అడ్డంగా గోడ నిర్మించారు. దీంతో రైతులు భూములకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదేంటని రైతులు అడిగితే ఆ భూమి తనదేనని రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేదని సదరు కింగ్ బదులిస్తున్నాడు.
గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
పంట పొలాలకు దారి లేకుండా గోడ నిర్మించడం, ప్రభుత్వ భూములను చేతిలో ఉంచుకోవడంపై గ్రీవెనన్స్ సెల్ ఫిర్యాదు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎంఎస్‌ఏంఈ పార్కుల ఏర్పాటు కోసం ఎక్కడా లేని భూములను సేకరించిన ప్రభుత్వం కర్లాంలో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ వదిలేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే సదరు కింగ్ మాత్రం ఆ భూములు తనవేనని తాను కొనుగోలు చేశానని చెప్పుకుంటున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ భూముల్లోనుంచి రైతులు వెళ్లకుండా ‘ఆడ్డుగోడ’..!
ఆ భూముల్లో గెస్ట్ హౌస్, ప్రహరీ నిర్మాణం
కర్లాంలో 87.34 ఎకరాలు ప్రభుత్వ గయాలు భూములు
87.34 ఎకరాలు ప్రభుత్వ భూములే
చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాలు ప్రభుత్వ భూములే. రెవెన్యూ రికార్డుల ప్రకారం 87.34 ఎకరాలు గయాలు భూములుగా నమోదై ఉన్నాయి. అందులో ఎలాంటి పట్టాలు మంజూరు కాలేదు. ఆ భూముల్లో అక్రమ కట్టడాలపై ఇంతవరకు మా దృష్టికి రాలేదు.
– డి.ధర్మరాజు, తహసీల్దార్, చీపురుపల్లి


