49 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

49 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

49 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

గజపతినగరం రూరల్‌: విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం పీడీఎస్‌ బియ్యం అక్రమ వ్యాపారంపై గజపతినగరంలో మెరుపు దాడి చేశారు. ఏకకాలంలో మూడు చోట్ల దాడులు చేసి మూడు ఆటోలతో తరలిస్తున్న 49 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం నుంచి మూడు ఆటోలతో వేరువేరు ప్రాంతాలకు పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం ఉదయమే పకడ్బందీగా ప్లాన్‌ చేసిన విజిలెన్స్‌ ఎండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో దాడులు చేసి లింగాలవలస బ్రిడ్జి, గజపతినగరం పీఏసీఎస్‌, గజపతినగరం రైల్వే స్టేషన్‌ సమీపంలో మూడు ఆటోలతో తరలిస్తున్న 48 బస్తాలు పట్టుకున్నారు. నిందితులపై 6ఎ కేసు నమోదు చేసి పట్టుబడిన బియ్యాన్ని లింగాలవలస రేషన్‌ డిపోకు, ఆటోలను గజపతినగరం పోలీసులకు అప్పగించారు. ఈ బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదే దాడుల్లో, 10 బస్తాల రాగులు కూడా దొరికినట్లు తెలుస్తోంది. దాడుల్లో గజపతినగరం పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్‌ చిరంజీవి, రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

రాజాంలో..

రాజాం: పట్టణంలోని చీపురుపల్లిరోడ్డులో ఆటోలో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఎస్‌డీటీ అనంత్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని గడిముడిదాం గ్రామం నుంచి గణపతి అనే వ్యక్తి ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్నారు. శుక్రవారం చీపురుపల్లి రోడ్డులో ఆర్‌ఐ మహేష్‌తో కలిసి వాహనాలు తనిఖీచేయగా బియ్యం పట్టుబడ్డాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 5 క్వింటాళ్ల బియ్యం దొరకగా బియ్యాన్ని సీజ్‌ చేసి, ఎంఎల్‌ఎస్‌ గోదాంకు తరలించామని, ఆటోను సీజ్‌చేసి, పోలీసులకు అప్పగించామని వివరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు సీఎస్‌డీటీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement