● ఏడుగురికి పాజటివ్
● గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా గుర్తింపు
విజయనగరం క్రైమ్ : గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా గంజాయి వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నామని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతున్నామని యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న గంజాయి వినియోగం అరికట్టేందుకు ఇటీవల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామన్నారు. గంజాయి డిటెక్షణ్ కిట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, మూత్ర పరీక్ష ద్వారా కేవలం ఒక నిమిషంలోనే వ్యక్తి గంజాయి వినియోగించాడో లేదో అని నిర్ధారణ చేయవచ్చన్నారు. గంజాయి వినియోగించే వారిని గుర్తించేందుకు యాంటీ గంజాయి టీమ్, ఈగల్ టీమ్ గంజాయి డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. 11మందికి పరీక్షలు నిర్వహించగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని, వాళ్లంతా గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను సేకరించి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను గాలిస్తున్నట్లు తెలిపారు.


