విజయనగరం క్రైమ్: సుపారీ ఇచ్చి సొంత అన్ననే హత్య చేయాలని తమ్ముడు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్‌ను విజయనగరం టూటౌన్ పోలీసులు పక్కా ప్రణాళికతో శుక్రవారం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం..గుర్లకు చెందిన బుచ్చినాయుడికి విజయనగరంలో కొన్ని భవనాలు ఉన్నాయి. వాటి మరమ్మతుల కోసం ఫోన్ ద్వారా కుమార్, శివ, బాలు అనే ముగ్గురిని సంప్రదించాడు. వారు చెప్పిన స్థలం రింగ్ రోడ్‌లో గల లెజెండ్ బార్ లైన్ లోకి వచ్చిన బుచ్చినాయుడిని వారు ముగ్గురూ చితక్కొట్టి రూ.15 వేలు లాక్కుని పారిపోయారు. దీంతో హాస్పిటల్ పాలైన బుచ్చినాయుడు ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్, ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బుచ్చినాయుడికి తమ్ముడు పిన్నింటి రాముతో ఊరిలో భూ తగాదాల ఉన్న కారణంగా సొంత అన్ననే అంతం చేయాలనుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాల్ డేటా ఆధారంగా పిన్నింటి రాముతో పాటు దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు.


