● పాలకురాలి కమార్తె ఫంక్షన్ కోసం అధికారులపై ఒత్తిడి
● మండలాల వారీగా టార్గెట్లు ● విస్తుపోతున్న ఉద్యోగవర్గాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే మరి... మన నాయకురాలి ఇంట్లో ఫంక్షన్ ఉంది.. మనమంతా దారుకోవాలి.. పూనుకోవాలి.. రాసుకోవాలి.. పూసుకోవాలి అని పూనకాలు తెచ్చుకున్న పచ్చపార్టీ నాయకులు అలవిమాలిన స్వామిభక్తిని చాటుకోవడం.. దీనికోసం మండలాల వారీగా అధికారులకు టార్గెట్లు ఇవ్వడం మన్యంలో చర్చనీయాంశంగా మారింది. అసలే గిరిజన ప్రాంతం... ఆపై ప్రైవేటు కార్యక్రమానికి టార్గెట్లు ఇవ్వడం ఉద్యోగ వర్గాలను కలవరపెడుతోంది. అమ్మగారి ఇంటిలో ఓణీల ఫంక్షన్ ధూమ్‌ధామ్ అయిపోవాలి.. మూడు జిల్లాల్లో హోరెత్తిపోవాలి.. ‘ఈశ్వరి’ని ఆశీస్సులు అందేలా.. రెండు మూడు తరాలు చెప్పుకునేలా ఉండాలి అంటూ వేపకొమ్మలతో కొట్టుకునే రేంజిలో పచ్చపార్టీ నేతలు ఊగిపోవడం... ఆ ఖర్చు భరించాలంటూ ఉద్యోగులపై రుద్దడం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా నియోజకవర్గ నేత ఇంటిలో ఇటీవల ఐదు మండలాలకు చెందిన అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి మండలానికి రూ.4లక్షల చొప్పున కలెక్షన్ చేయాలంటూ టార్గెట్లు ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. మండలాధికారులకు టార్గెట్లు అంటే అది ఆయన పరిధిలోనే ఉపాధి హామీ సిబ్బందితోపాటు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడిపడుతుంది. మండలాధికారి ఆదేశాల మేరకు ఆయా ఉద్యోగులు చందాలు వేసుకుని ఆ నాలుగు లక్షలు పోగేసి ఇవ్వా ల్సిన పరిస్థితి. ఇప్పటికే పంచాయతీరాజ్ , గ్రామీణాభివద్ధి శాఖల ఉద్యోగులు అలవిమాలిన పని ఒత్తిడి.. దండగమారి సర్వేలు, సమీక్షలతో నలిగిపోతున్న తరుణంలో ఓణీ ఫంక్షన్ కోసం ఇప్పుడు ఏకంగా చందా వసూళ్ల బాధ్యతలు పెట్టడంతో వారు అవుననలేక.. కాదనలేక లోలోన కుమిలిపోతున్నారు. మొత్తం మీద అమ్మవారి ఇంట ఫంక్షన్‌లో డీజేల ముందు డ్యాన్స్‌లు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను అనివార్యంగా కార్యకర్తలు ముందుకు నెడుతున్నారంటూ కొందరు బహిరంగంగానే మండిపడుతున్నారు.
ఇదెక్కడి తీరు..
పచ్చపార్టీ కార్యకర్తలు.. నాయకులకు రోకు ఉంటే వాళ్లువెళ్లి టెంట్లువేయాలి... పందిరి బొంగులు పాతాలి.. గాడి పొయ్యిలు తవ్వాలి... నీళ్ల కావిళ్లు మోయాలి కానీ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మేమెందుకు ఈ పాలేరు పనిచేయాలంటూ ఉద్యోగులు లోలోన మదనపడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇలాంటి చందాల సంస్కృతి ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఎవరైనా నాయకుల ఇళ్లలో ఫంక్షన్ ఉంటే అధికారులు తమ భక్తికొద్దీ త్రుణమోపణమో సీక్రెట్‌గా సమర్పించుకుని వచ్చేవారు. ఇప్పటిలా ఏకంగా సిబ్బంది మొత్తం పులివేషాలు వేసుకుని ఆటాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలా అని మండలాధికారులు ఆలోచనలు చేస్తుండగా, కొత్తగా ఓ మండలానికి వచ్చిన అధికారి ఆ స్థాయిలో కలెక్షన్ చేయలేనని కరాఖండిగా చెప్పడంతో టార్గెట్‌లో రూ.లక్షన్నర తగ్గించారట. మరికొన్ని శాఖలకు కూడా వేర్వేరుగా టార్గెట్లు ఫిక్స్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఊరి సొమ్ము రాంభజన అన్నట్లుగా ఉద్యోగుల చందాలతో ఫంక్షన్ చేసేందుకు పూనుకున్న నేత ‘ఛీప్’ట్రిక్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోజనం కోసం పిలవాలే గానీ చందాలు పట్టుకుని భోజనానికి రండి అంటూ ఆర్డర్‌వేయడంపై మండిపడుతున్నారు. మొత్తానికి అమ్మగారింట్లో ఫంక్షన్ అటు నాయకులకు మోదం.. ఉద్యోగులకు ఖేదంగా మారింది.


