విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడిగా కంది వెంకటరమణ ఎన్నికయ్యారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ప్రొసీడింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, రాష్ట్ర పరిశీలకులుగా శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్‌మోహన్ రావు వ్యవహరించారు. వైస్ చైర్మన్‌గా డాక్టర్ కేపీ వరలక్ష్మి, కోశాధికారిగా డాక్టర్ పొగరు విశ్వేశరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా బి.రామకృష్ణారావు, ఎస్. రాజు, పి.దుర్గాప్రసాద్, డి.సూర్యారావు వై.వీర్రాజు, కె.ఎర్నాయుడు, వెన్నెల చంద్రశేఖర్, ఎం.తిరుపతిరావు, బీవీ గోవిందరాజులు ఎన్నికయ్యారు.
పదో తరగతి షార్ట్‌మార్క్స్ మెమోలు విడుదల
విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల షార్ట్ మార్‌స్క్ మెమోలు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ మాణిక్యంనాయుడు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ ద్వారా మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసి, సంతకం చేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మార్క్స్ మెమోల్లో విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, ఇతర సమాచారం విషయంలో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని స్కూల్ లాగిన్‌లో సరిచేసుకునేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోపు వివరాలను పరిశీలించి, తప్పులు ఉంటే వెంటనే సవరించాలని డీఈఓ సూచించారు.
పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
సంతకవిటి: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి వైద్యసిబ్బందికి సూచించారు. మండలంలోని మండవకురిటి పీహెచ్‌సీని ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో నమోదైన ఓపీ, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పీహెచ్‌సీకి వచ్చిన రోగులకు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రశాంత్, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు తప్పనిసరి
విజయనగరం అర్బన్: జిల్లాలోని సినిమా థియేటర్ల యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జేసీ సేతుమాధవన్ సూచించారు. థియేటర్ల నిర్వహణ, ఎన్‌ఓసీ నమోదు, ప్రభుత్వ ప్రజా అవగాహన చిత్రాల ప్రదర్శన తదితర అంశాలపై తన చాంబర్‌లో శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లు విధిగా ఏపీఎస్‌ఎఫ్‌టీవీడీసీ వద్ద నమోదు చేసుకొని ఎన్‌ఓసీ పొందాలని స్పష్టం చేశారు. ఫారం–బీ లైసెన్స్ మంజూరుకు, అలాగే దాని పునరుద్ధరణకు ఎన్‌ఓసీ కచ్చితంగా తీసుకోవాలన్నారు. సమావేశంలో సీ–సెక్షన్ పర్యవేక్షకులు డి.శేఖర్, జిల్లాలోని పలు సినిమా థియోటర్ల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం: జిల్లాలో ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు ‘యోగాంధ్ర – 2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ‘ఒక జిల్లా–ఒకే ఇతివృత్తం’ నినాదంతో యోగా ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 11న తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, 15న సీతంపేటలోని ఎన్‌టీఆర్ అడ్వెంజర్ పార్క్, 20న పాలకొండ, పార్వతీపురం, సాలూరులలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.


