విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు పింఛన్ కష్టాలు తప్పడంలేదు. రాజకీయ కక్షసాధింపు చర్యలతో నలిగిపోతున్నారు. మొన్నటివరకు దివ్యాంగత్వం నిర్ధారణ కోసం జిల్లాలోని సుమారు 35వేల మంది ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వ్యయప్రయాసలకు గురయ్యారు. దివ్యాంగత్వ నిర్ధారణను పూర్తిచేసుకున్నారు. పింఛన్ పొందేందుకు అర్హత సాధించారు. తాజాగా గజపతినగరం నియోజకవర్గంలో కొందరు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి మళ్లీ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్షతో అర్హుల పింఛన్లను తొలగించేందుకు పూనుకోవడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.
మంత్రి ఇలాకాలో దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు...
రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ, సెర్ప్ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి సర్టిఫికెట్స్ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దివ్యాంగ పింఛన్ పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారని టీడీపీ నేతలు ఏపీ రాష్ట్రసోషల్ ఆడిట్ అథారిటీ( ఏపీఎస్‌ఏఏటీ) డైరెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు సోషల్ ఆడిట్ అథారిటీ టీమ్ ఇద్దరు సభ్యులను క్షేత్రస్థాయి తనిఖీల కోసం పంపించింది. కేవలం గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు అయిన దివ్యాంగులు 16 మంది ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించాలనే కుట్రతోనే తరచూ తనిఖీలు చేపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ నిట్టూర్చుతున్నారు. పింఛన్లను అన్యాయంగా తొలగిస్తే న్యాయస్థానం తలపుతట్టేందుకు దివ్యాంగులు సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి మాట్లాడుతూ దివ్యాంగుల సర్టిఫికెట్ల క్షేత్రస్థాయి తనిఖీ విషయం తెలియదన్నారు. ఏపీఎస్‌ఏఏటీ డైరెక్టర్ నేరుగా తనిఖీ బృందాన్ని పంపించి ఉండవచ్చన్నారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్
ప్రభుత్వం నిర్వహించిన పింఛన్
రీవెరిఫికేషన్ పూర్తి
ప్రజాప్రతినిధి ఒత్తిడితో మళ్లీ దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు
ఆందోళనలో దివ్యాంగులు


