డంపింగ్‌ యార్డు కథ మొదటికి! | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌ యార్డు కథ మొదటికి!

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

డంపింగ్‌ యార్డు కథ మొదటికి!

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలో చెత్తశుద్ధి నిర్వహణ అంటూ కొన్నాళ్లు హడావిడి చేసినా.. ’చెత్త’ కథ మళ్లీ మొదటికే వచ్చింది. గుత్తేదారు సంస్థ కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలను, యంత్రాలను తీసుకుని వెనుదిరిగింది. పార్వతీపురం పట్టణంలో సుమారు 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దాదాపు 13 వేల నివాస గృహాలుండగా.. ఆవాసాలు, వ్యాపార సంస్థల నుంచి రోజుకు 25 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. పట్టణ శివారులో ఉన్న డంపింగ్‌ యార్డులోనే దీన్ని పారబోస్తున్నారు. డంపింగ్‌ యార్డు సమస్య పట్టణ వాసులను ఏళ్లుగా వేధిస్తోంది. గతంలో పట్టణంలోని చెత్తశుద్ధి నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ సంస్థ తరుణి ఏజెన్సీకి పనులు అప్పగించింది.

ఆ మేరకు కొన్నాళ్ల కిందట యార్డు సమీపంలోనే పనులు ప్రారంభించారు. చెత్తను నాలుగు భాగాలుగా ప్లాస్టిక్‌, మట్టిరాళ్లు, రబ్బరు, గాజు వ్యర్థాలను వేర్వేరు యంత్రాలతో విభజించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్‌ను విక్రయానికి తరలించి, మిగిలిన పనికిరాని వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపేస్తారు. ఇలా పట్టణంలో 12 వేల టన్నుల వరకు వ్యర్థాలను విభజించాలి. వ్యర్థాలను మళ్లీ పట్టణంలోనే పారబోయడంపై విమర్శలు వ్యక్తమైన విషయం విదితమే. తాజాగా సదరు సంస్థకు అప్పగించిన కాంట్రాక్టు ముగియడంతో పనులు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తదుపరి మున్సిపల్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement