● ఢిల్లీ ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ చేయడమే లక్ష్యం
విజయనగరం అర్బన్: వైద్యవిద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎన్‌ఐ–ఎస్‌ఎస్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విజయనగరం పట్టణానికి చెందిన డాక్టర్ ముడిలి సాయిబోధన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. డీఎం క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ విభాగంలో 3వ ర్యాంక్ సాధించారు. పూల్‌బాగ్ కాలనీకి చెందిన సాయిబోధన్ చిన్నతనం నుంచే చదువులో దిట్ట. పదో తరగతి వరకు బాబామెట్ట కేంద్రీయ విద్యాలయంలో చదివారు. ఇంటర్ కార్పొరేట్ సంస్థలో చదివి నీట్‌లో 1,500 ర్యాంక్ సాధించి తొలి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు తెచ్చుకున్నారు. పీజీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 305 ర్యాంక్ సాధించి భువనేశ్వర్‌లో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తిచేశారు. తాజాగా ఐఎన్‌ఐ ఎస్‌ఎస్ పరీక్షలో ప్రతిభ చూపి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో డీఎం పూర్తిచేయాలనే తన జీవిత కలను నిజం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే చదువులో రాణించగలిగానని బోధన తెలిపారు. కుమారుడు చదువులో రాణించడంపై తల్లిదండ్రులు జ్యోతి(టీచర్), నాగభూషణరావు, విశ్రాంత హెచ్‌ఎం అయిన తాతయ్య లక్ష్మణరావు సంతోషం వ్యక్తంచేశారు.


