సర్వజన ఆస్పత్రి ఇన్‌చార్జి ఏడీగా ఎర్రాజీరావు | - | Sakshi
Sakshi News home page

సర్వజన ఆస్పత్రి ఇన్‌చార్జి ఏడీగా ఎర్రాజీరావు

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఇన్‌చార్జి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌)గా సుంకర ఎర్రాజీరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏడీగా పనిచేసిన పి.ఎన్‌.అప్పారావు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన బాధ్యతలను ఎర్రాజీరావుకు అప్పగించారు. ఏడీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయం ఉద్యోగులు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు.

ఆదాయార్జనలో వెనుకబాటు తగదు

వివిధ శాఖల అధికారులపై కలెక్టర్‌ సీరియస్‌

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ప్రభుత్వానికి రావలసిన ఆదాయ వనరుల సమకూర్పులో వివిధ ప్రభుత్వ శాఖలు వెనుకబడడం సరికాదని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి అన్నారు. నిర్దేశించిన వార్షిక లక్ష్యాల సాధనలో వెనుకంజలో ఉన్న శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రిజిస్ట్రేషన్‌, రవాణా, మైనింగ్‌, ఎకై ్సజ్‌, అటవీ, వాణిజ్య పన్నలశాఖ ఉన్నతాధికారులతో కలెక్టర్‌ బుధవారం అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల నత్తనడక తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తంచేస్తూ టార్గెట్లు రీచ్‌కాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు, సాంకేతిక వైఫల్యాల వల్లే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని మండిపడ్డారు. సమావేశంలో నోడల్‌ అధికారి రేవతి, రవాణా డిప్యూటీ కమిషనర్‌ మణికుమార్‌, ఎకై ్సజ్‌ కమిషనర్‌ బి.శ్రీనాథుడు, జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్‌ నిర్మలాజ్యోతి, గనుల శాఖ డీడీ సూర్యచంద్రరావు పాల్గొన్నారు.

‘జలధార–జలహారతి’ పనులపై సమీక్ష

జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధి– పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ వర్చుల్‌గా సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల సమాచారం, నిర్వహణ వ్యవస్థ (రిమ్స్‌) యాప్‌లో నమోదైన పనుల వివరాలను పరీశీలించారు. పరిపాలన ఆమోదం పొంది ఇంకా ప్రారంభం కాని 2,815 పనులు వెంటనే గ్రౌండ్‌ అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి, జిల్లా పంచాయతీ, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

మెరకముడిదాం వీఏఏ సస్పెన్షన్‌

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

ఎరువుల డబ్బులు మార్క్‌ఫెడ్‌కు

చెల్లించకపోవడమే కారణం

మెరకముడిదాం: స్థానిక సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ మల్లేడ భాస్కరరావుపై సస్పెన్షన్‌ విధిస్తూ కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి రెండురోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం మెరకముడిదాం విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ మల్లేడభాస్కరరావు ఎరువుల పంపిణీకి చెందిన రూ.1 లక్షా 25 వేలు మార్క్‌ఫెడ్‌కు చెల్లించకపోవడంతో మార్క్‌ఫెడ్‌ అధికారులు పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరారు. అయితే వీఏఏ భాస్కరరావు తరచూ వాయిదాలు వేస్తుండడంతో మార్క్‌ఫెడ్‌ అధికా రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ భాస్కరరావుపై సస్పెన్షన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భాస్కరరావు సస్పెన్షన్‌ విషయాన్ని మండలానికి చెందిన అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement