● 10 కేంద్రాల్లో 1,980 మంది టీచర్లకు శిక్షణ
● తొలిరోజున అసౌకర్యాల నడుమ ‘శిక్ష’ణ
విజయనగరం అర్బన్: విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమెరసీ–ఎఫ్‌ఎల్‌ఎన్) మెరుగుపరచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఆరు రోజులపాటు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా విజయనగరం, బొబ్బిలి, రామభద్రపురం, చీపురుపల్లి, రాజాం నియోజకవర్గ కేంద్రాల పరిధిలో మొత్తం 10 కేంద్రాల్లో 1980 మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల నిర్వహణను డీఈఓ యు.మాణిక్యంనాయుడు సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు శాతం, బోధనా పద్ధతులు, గ్రూప్ యాక్టివిటీస్, శిక్షణ సామగ్రి వినియోగాన్ని పరిశీలించారు. గణిత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు.
అసౌకర్యాల ‘శిక్ష’ణ
ఆరు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తొలిరోజున అసౌకర్యాల నడుమ జరిగిందని ఉపాధ్యాయులు వాపోయారు. పట్టణంలోని పూల్‌బాగ్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇరుకు గదులు, పిల్లలకు వినియోగించే బెంచీలు, తిరగని ఫ్యాన్‌ల నడుమ శిక్షణ ఇవ్వడంపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. అయితే, పదో తరగతి సప్లిమెంట్ పరీక్షల కారణంగా తరగతి గదులు ఖాళీగా లేవని, 5వ తేదీ తర్వాత సమస్య ఉండదని సమగ్రశిక్ష అధికారులు తెలిపారు.


