చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (వీఈడబ్ల్యూ) లోచర్ల సాయిబాబు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సాయిబాబు సిరుగుడుపేట వద్ద గల ఏబీ స్విచ్‌ను ఆఫ్ చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్ పక్కనే ఉన్న హెవీ లైన్‌కు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ ప్రమాదానికి గురైన సాయిబాబును రాజాం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే సాయిబాబు ప్రాణాలు కోల్పోయాడు. సాయిబాబు చీపురుపల్లి ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 20 ఏళ్లుగా సొంత గ్రామంలోనే విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో భార్య, పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇరవై ఏళ్లుగా చీపురుపల్లిలో ఆర్‌ఈసీఎస్ ఉన్నప్పటి నుంచి విధులు నిర్వహిస్తూ విద్యుత్ షాక్‌తో మరణించిన సాయిబాబు కుటుంబాన్ని ఆదుకోవాలని ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న వీఈడబ్ల్యూలు, జేఎల్‌ఎమ్, ఎనర్జీ అసిస్టెంట్ల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.


