● మొక్కలు నాటుదాం..పుడమి తల్లికి
కానుకిద్దాం
● ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ
● నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం
విజయనగరం గంటస్తంభం: మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అసలు ఒడి మాత్రం ప్రకృతిదే. గాలి, నీరు, నీడనిచ్చేది ప్రకృతి. అలాంటి ప్రకృతినే మనిషి తన చేతులతో నాశనం చేస్తున్నాడు. ఒకప్పుడు ఊరి బయట పెద్ద పెద్ద మర్రిచెట్లు ఉండేవి. వాటి కింద రైతులు సేద తీరేవారు. ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. పక్షులు గూళ్లు కట్టుకునేవి. ఇప్పుడు ఆ చెట్ల స్థానంలో సిమెంట్ కట్టడాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నిండుగా కళకళలాడిన చెరువులు ఇప్పుడు ఎండిన మైదానాలుగా మారుతున్నాయి. అభివృద్ధి పేరుతో మనిషి ప్రకృతిని దూరం చేసుకుంటున్నాడు. కానీ ప్రకృతిని కోల్పోతే అభివృద్ధి కూడా నిలవదనే విషయాన్ని మరిచిపోతున్నాడు.
ప్రకృతి విలాపం వినిపించదా?
ఈ వేసవిలో విజయనగరం జిల్లాలో మండిపోయిన ఎండలకు మధ్యాహ్నం పూట రోడ్లపై జనాలు కనిపించలేదు. చెట్టు నీడ కోసం వెతికే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు..ప్రకృతి మనకు ఇస్తున్న హెచ్చరిక. మనిషి అవసరాల కోసం ప్రకృతిని వాడుకోవడం సహజమే. కానీ స్వార్థం కోసం దోచుకోవడం ప్రమాదకరం. చెట్లు నరికేస్తున్నాం. అడవులను మాయం చేస్తున్నాం. ప్లాస్టిక్‌తో భూమిని నింపేస్తున్నాం. అయినా ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవడం లేదు. కానీ తన బాధను ఎండల రూపంలో, తుఫాన్ల రూపంలో, వరదల రూపంలో మనకు చూపిస్తోంది.
2026 థీమ్..ప్రకృతే భవిష్యత్తుకు దారి
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ‘ఇన్‌స్పైర్డ్ బై నేచర్..ఫర్ క్‌లైమేట్...ఫర్ అవర్ ఫ్యూచర్’’ అంటే ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని వాతావరణ మార్పులను ఎదుర్కొని భావితరాలకు సురక్షిత భవిష్యత్తు అందించాలన్నదే ప్రధాన సందేశం. చెట్లు, అడవులు, చెరువులు, జీవవైవిధ్యం రక్షించడమే వాతావరణ సంక్షోభానికి అసలైన పరిష్కారమని ఈ థీమ్ చెబుతోంది.
పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు, కరువు పరిస్థితులు, వేడిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనిని నియంత్రించకపోతే భవిష్యత్తులో మరిన్ని విపత్తులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో పచ్చదన ఉద్యమం:
ఉమ్మడి విజయనగరం జిల్లాలో అటవీశాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో మొక్కల నాటడం, అవగాహన ర్యాలీలు, పర్యావరణ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడవుల విస్తీర్ణం పెంచడం, చెరువులను సంరక్షించడం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చని భవిష్యత్తు
పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా మొక్కలు నాటడం, నీటిని ఆదా చేయండం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టాలి. అప్పుడే భావితరాలకు పచ్చని భవిష్యత్తు అందించగలం.
నాటిన మొక్కను కాపాడితే పర్యావరణానికి మేలు..
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. జిల్లాలో లక్షలాది మొక్కల పెంపకానికి లక్ష్యాలు నిర్దేశించాం. పచ్చదనం పెరిగితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. ప్రతి ఇంటి ముందూ ఒక మొక్క, ప్రతి గ్రామంలో ఒక పచ్చని ఉద్యమం అవసరం
బిర్లంగి రామ్‌నరేష్,
ఫారెస్ట్ రేంజ్ అధికారి, విజయనగరం


