నీట్‌ అవకతవకలపై విద్యార్థులఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

నీట్‌ అవకతవకలపై విద్యార్థులఆగ్రహం

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

విజయనగరం గంటస్తంభం:

నీట్‌, యూజీ తదితర ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ పరీక్షల నిర్వహణ పేరుతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విద్యార్థుల భవిష్యత్తును తాకట్టుపెడుతోందని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు నిరసనగా భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్‌ కూడలి వద్ద బుధవారం ఆందోళన చేశారు. ర్యాలీ, మానవహారం చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. తక్షణమే మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పూడి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ లీకేజీల విషయంలో వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. ఎన్నిసార్లు ప్రశ్నపత్రాలు లీకవుతున్నా ప్రభుత్వం మాత్రం నిందితులను శిక్షించడం కంటే వివరణలు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందని విమర్మించారు. కోట్లాది మంది విద్యార్థుల కష్టం, ప్రతిభ, ఆశయాలను కొందరి అక్రమాలకు బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, పరీక్షల అవకతవకల వల్ల నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు వి.చిన్నబాబు, గర్‌ల్స్‌ కన్వీనర్‌ ఆర్‌.శీరీష, ఉపాధ్యక్షుడు ఎం.వెంకీ, సహాయ కార్యదర్ములు ఎస్‌.సోమేశ్‌, పి.రమేష్‌,జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement