విజయనగరం ఫోర్ట్: రాజాం ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.హరిబాబు పై సస్పెన్షన్ విధిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సౌరబ్‌గౌర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న గజపతినగరం ఏరియా ఆస్పత్రికి ఓ విచారణ నిమిత్తం డాక్టర్ హరిబాబు వెళ్లారు. అసమయంలో అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారు కలెక్టర్‌కు, డీసీహెచ్‌ఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డాక్టర్ హరిబాబుపై సస్పెన్షన్ విధించాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి డీసీహెచ్‌ఎస్ ప్రతిపాదనలు పంపించారు. దీంతో హరిబాబుపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఖరీఫ్ ప్రణాళికను రూపొందించాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ సీజన్ కోసం పకడ్బందీగా ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి రైతును దృష్టిలో పెట్టుకుని రైతు సేవా కేంద్రం వారీగా , గ్రామ మండల స్థాయి ప్రణాళికలను రుపొందించాలన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక అమలు, ఉత్పాదకాల నిర్వహణ, ఉద్యాన పంటల సాగు పెంపుపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మిషన్ హార్టీ విజన్ కింద మొత్తం 4,388 మంది రైతులను, 9,358.35 ఎకరాల విస్తీర్ణం గుర్తించినట్లు తెలిపారు. ఇందులో బోరుబావి, విద్యుత అనుసంధాన సౌకర్యాలు ఉన్న మొదటి విభాగం కింద 1154 మంది రైతుల సమ్మతి పత్రాలు సేకరించి ప్రాజెక్టు అమలుకు సిద్ధం చేశామన్నారు. బోరుబావి ఉండి విద్యుత్ అనుసంధానం లేని రెండవ విభాగం కింద 655 మంది రైతుల్లో 333 మంది నుంచి అంచనాలు స్వీకరించి 172 మంది సమ్మతి పత్రాలు సేకరించామన్నారు. బోరుబావి, విద్యుత్ రెండూ అవసరమైన 2,579 మంది రైతుల్లో 990 అంచనాలు, 271 సమ్మతి పత్రాలు సేకరించినట్టు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి రామారావు, ఉద్యానశాఖ అధికారి చిట్టిబాబు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి పాల్గొన్నారు.
మక్కువ: ఏనుగుల గుంపు సంచారంతో ప్రజల కు, పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌ఓ ప్రసూన అటవీశాఖ సిబ్బందిని ఆదేశించారు. మక్కువ మండలం మా ర్కొండపుట్టి పంచాయతీ వీరాడవలస గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును ఆమె బుధవారం పరిశీలించారు. ఇంతవరకు పంటలు, ప్రజలకు కలిగిన నష్టం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు దిశ మార్చిన తర్వాత పంటల నష్టం వివరాలను సేకరిస్తున్నామని డీఎఫ్‌ఓకు వివరించారు.


