● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
● ఆర్డీవోలతో వెబెక్స్‌లో సమీక్ష
విజయనగరం అర్బన్: జిల్లాలోని అటవీభూములను త్వరితగతిన గుర్తించి వాటికి సంబంధించిన సమగ్ర నివేదికలను తక్షణమే సమర్పించాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆర్డీఓలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ లోపల భూ పరిపాలన ప్రధాన కమిషన్ (సీసీఎల్‌ఏ)కు నివేదిక పంపాల్సి ఉన్నందున అధికారులు వేగంగా స్పందించాలన్నారు. జిల్లాలోని అటవీ భూములు, కొండపోరంబోకు స్థలాలు, ఉద్యాన వనాలు, అడవిలా కనపడే జంగిల్ ప్రాంతాలు, నదిపరీవాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అటవీ భూములను క్షుణ్ణంగా గుర్తించాలని జేసీ స్పష్టం చేశారు. ఈ అంశంపై సంబంధిత తహసీల్దార్లు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, నివేదికలను వెంటనే ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై గౌరవ సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని అటవీ భూముల పూర్తి వివరాలను ప్రభుత్వానికి అత్యవసరంగా పంపాల్సి ఉందన్నారు. ఇందులో అధికారులు ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి సోమసుందర్ నేరుగా పాల్గొనగా వెబెక్స్ ద్వారా ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, రాంమోహన్‌రావు, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


