వెన్నుపోటు పాలనపై
విజయనగరం:
అధికార దాహంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీనికి నిరసనగా బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించేందుకు సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు పిలుపుమేరకు ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలోని రింగ్‌రోడ్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లతో పాటు రెండేళ్లలో హమీలు అమలు తీరుపై ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని, వాటిని రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమాల షెడ్యూల్‌ను వెల్లడించారు.
రైల్వే జోన్ క్రెడిట్ వైఎస్సార్‌సీపీదే...
రైల్వే జోన్ సాధనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని.. రైల్వేజోన్ కోసం వైఎస్సార్ సీపీ నాడు పెద్ద ఎత్తున చేసిన పోరాటాల ఫలితంగా వచ్చిందన్నారు. ఆ పోరాటాల కారణంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై నమోదైన కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తున్నాయని, అది వైఎస్సార్‌సీపీ క్రెడిట్ అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు. తమ ప్రభుత్వంలో తీసుకు వచ్చిన కంటకాపల్లి వద్ద యాభై ఎకరాల్లో ఏర్పాటైన అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ట్రయల్‌రన్ పూర్తి చేసుకుని త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.
నాడు వివక్షకు తావు లేకుండా...
గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల సుపరిపాలనలో తనమన వివక్షకు తావులేకుండా అందరికీ సంక్షేమ పథకాలను అందచేశారని జెడ్పీ చైర్మన్ గుర్తు చేశారు. విద్యా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. నాడు–నేడు, ఆంగ్ల బోధన, అమ్మ ఒడి తదితర సంస్కరణలు తీసుకువస్తే కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేస్తే, కూటమి ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. టెట్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో దొడ్డిదారిన ఉద్యోగాలు ఇవ్వడం కేవలం ఆరోపణలుగా కొట్టిపారేస్తున్న అధికారులు, వాటిని ఆధారాలతో చూపలేకపోతున్నారన్నారు. అసోసియేషన్లు, ఫెడరేషన్లు చెబితే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేస్తారా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో యూరియా, విత్తనం కావాలంటే రైతులు లాఠీ దెబ్బలు తినాలని, పంటలకు బీమా లేదు, గిట్టుబాటు ధర లేదు ప్రభుత్వం రైతును ఆదుకున్న పరిస్థితులు లేవని జెడ్పీ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల లో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు, నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. పద్దెనిమిదేళ్ల మహిళలకు ప్రతినెలా ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న రూ.1500 హామీ అసలు అమలే కాలేదన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎటువంటి ఆర్థికఆసరా లేనివారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పథకంలో రెండేళ్లలో ఒక్క కొత్తవారికీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రెండేళ్లలో దాదాపు 11 లక్షలకు పైగా పెన్షన్లు తొలగించారన్నారు.
ఉపాధిహామీ పథకం స్వప్రయోజనాల పథకంగా అధికార పార్టీ నేతలు మార్చేశారని విమర్శించారు. జిల్లా వాసులు తాగునీటికి తహతహలాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటేలా 200–300 శాతం పెరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తోంది తప్పితే, ధరలను నియంత్రించే చర్యలను చేపట్టడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కలనాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, ఇప్పిలి అనంత్; జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు, మేధావుల విభాగం అధ్యక్షుడు సత్యారావు , ఉపాధ్యాయుల విభాగం అధ్యక్షుడు గంగారావు, గుర్ల జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
మోసం గ్యారంటీ అయ్యింది..
2024 ఎన్నికలకు ముందు , అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించి వెన్నుపోటు పొడిచిందని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. సూపర్ సిక్స్‌తో పాటు మరో 125 హమీలు ఇచ్చిన కూటమి నేతలు వాటిని అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఏమైందని, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీగా మిగిలిందని ఎద్దేవాచేశారు.
రెండేళ్ల పాలన అంతా అవినీతి,
అరాచకాలే..
దీనిపై 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు
8, 9 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రజా అవగాహన సభలు
12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
ప్రజాక్షేత్రంలో కూటమి మోసకారి పాలనను ఎండగడదాం
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ


