● ధ్రువపత్రాల కోసం సచివాలయాలచుట్టూ తిరుగుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
మా దృష్టికి రాలేదు
స్వర్ణ గ్రామ, వార్డు సచివాయాలుగా మార్చడం వల్ల ప్రస్తుతం ఉన్న హైసెక్యూరిటీ పేపర్స్ స్టాక్‌ను పూర్తి చేస్తున్నాం. అందువల్ల స్టాకు రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కువ స్టాకు ఉన్న సచివాలయం నుంచి తీసుకుని ధ్రువపత్రాలు జారీ చేయాలని సచివాలయ డిప్యూటీ ఎంపీడీఓలకు ఆదేశించాం. కొత్త స్టాకు ఈ నెల 10వ తేదీలోపు జిల్లాలకు చేరుతుంది. మండలాల్లోని సచివాలయాలకు పంపిస్తాం. ఇప్పటి వరకు సచివాలయాల్లో స్టాకు లేదన్న విషయం మా దృష్టకి రాలేదు.
– రోజారాణి, డీఎల్‌డీఓ, విజయనగరం
నా పేరు చింతాడ లక్ష్మణరావు. రామభద్రపురం మండలం మిర్తివలస. మా మనవడు శరత్ ఏడో తరగతి చదువుతున్నాడు. వాడి చదువుకు అవసరమైన కులం, ఆదాయ ధ్రువపత్రాలకు రొంపల్లి సచివాలయంలో రూ.100 చెల్లించి దరఖాస్తు చేశాను. ధ్రువపత్రాల కోసం సిబ్బందిని అడిగితే హైసెక్యూరిటీ పేపర్లు అయిపోయాయి. కొద్ది రోజులు సమయం పడుతుందని చెబుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా ప్రయోజనం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటికి తెచ్చి ధ్రువపత్రాలు ఇచ్చేవారు.
రామభద్రపురం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాల్లో కోతలేకాదు.. విద్యార్థులు, రైతులు, వినియోగదారులకు వివిధ ధ్రువపత్రాల కోసం వినియోగించే హైసెక్యూరిటీ పేపర్లకూ కటకటలాడాల్సిన దుస్థితి. పేపర్లు లేక సచివాలయ సిబ్బంది ధ్రువపత్రాల మంజూరుకు చేతులెత్తేస్తున్నారు. పేపర్లు లేవు.. వారం రోజులు తరువాత రావాలని నచ్చజెబుతున్నారు. జిల్లాలో 666 గ్రామ, వార్డు సచివాయాలు ఉన్నాయి. చాలా సచివాలయాల్లో హైసెక్యూరిటీ పేపర్ల కొరత వెంటాడుతోంది. దీంతో కులం, నివాస, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీకాక ప్రజలు వారంరోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పదో తరగతి, ఇంటర్, పాలిసెట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ తదితర పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు విద్యార్హత పత్రాలతో పాటు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. ఈ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో ధ్రువపత్రాలు పొందేందుకు వేలాదిమంది విద్యార్థులు సచివాలయాల్లో నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల పరిశీలన అనంతరం ధ్రువపత్రాలు మంజూరు చేసినా హైసెక్యూరిటీ పేపర్లు లేక విద్యార్థుల చేతికి ధ్రువపత్రాలు అందడం లేదు. విద్యాసంవత్సర ఆరంభ సమయంలో సచివాలయాలకు అవసరమైన పేపర్లు సరఫరా చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సచివాలయ సేవలను నిర్వీర్యం చేయాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, ధ్రువపత్రాలను వలంటీర్లే ఇంటికి తెచ్చి ఇచ్చేవారని గుర్తుచేసుకుంటున్నారు.


