విజయనగరం అర్బన్: భారత ప్రభుత్వం 2027 సంవత్సరంలో ప్రదానం చేసే ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్’ అవార్డుల కోసం అర్హత గల పిల్లల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ, ధైర్యసాహసాలు కనబరిచిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత అవార్డులను ప్రదానం చేస్తుందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామాజికసేవ, విద్య, క్రీడలు, కళలు, సంస్కృతి, ధైర్యసాహసాలు, తదితర రంగాలకు చెందినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2026 జూలై 31 నాటికి 5 సంవత్సరాలు నిండి 18 సంవత్సరాలు మించని భారతీయ బాలబాలికలు మాత్రమే పురస్కారానికి అర్హులని పేర్కొన్నారు. జూలై 31 లోపు ‘అవార్‌ుడ్స.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
వైద్య విద్యార్థుల పరిశోధనకు పార్ధివదేహం అప్పగింత
విజయనగరం ఫోర్ట్: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం రాజుల తాళ్లవలసకు చెందిన దాట్ల సూర్య అప్పలరాజు (87) వృద్ధాప్య సమస్యతో మంగళవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానంచేశారు. మృతదేహాన్ని కూడా అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థుల పరిశోధన కోసం వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌కు మంగళవారం అప్పగించారు. మృతుని కుమార్తె రమాదేవిని వైద్య సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎనాటమీ హెచ్‌ఓడీ డాక్టర్ గీతాదేవి, అసోసియేట్ ప్రొఫెసర్ టి.సురేఖ, అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ, తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల పిల్లలకు వైద్య విద్యా వరం
● ఈఎస్‌ఐసీ కళాశాలల్లో ప్రవేశాలు
విజయనగరం గంటస్తంభం: కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్యవిద్యలో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ ఐసీ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్‌డీవీ ప్రసాదరావు తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలల్లో ఐపీ(ఇన్స్యూర్డ్ పర్సన్) కోటా కింద 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కోటా ద్వారా ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు నీట్–యూజీ 2026లో అర్హత సాధించడంతో పాటు ఈఎస్‌ఐసీ జారీ చేసే వార్డ్ ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. 2025 సెప్టెంబరు 30 నాటికి ఈఎస్‌ఐసీ సభ్యత్వం కలిగిన కార్మికుల పిల్లలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈఎస్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఐపీ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం ఎంసీసీ నిర్వహించే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈఎస్‌ఐసీ, ఎంసీసీ వెబ్‌సైట్లను సందర్శించాలని, సందేహాల నివృత్తికి ఫోన్ 94922 55500నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.


