డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ విజయనగరం కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగులు, యువత
విజయనగరం గంటస్తంభం:
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అవకతవకలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పోర్ట్స్ కోటాతో సహా పలు విభాగాల్లో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టి అధిక మార్కులు సాధించిన నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు. పోస్టులను డబ్బులకు అమ్మేశారంటూ ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ముందుగా విజయనగరం కంటోన్మెంట్ మున్సిపల్ పార్క్ నుంచి రాజీవ్ యువకేంద్రం మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ డౌన్‌డౌన్, తక్షణమే రాజీనామా చేయాలంటూ నినదించారు. మెగా డీఎస్సీ కాదు... ఇది దగా డీఎస్సీ, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు, మెరిట్ లిస్ట్ ఎందుకు దాచారు?, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎవరికిచ్చారు? అంటూ నినాదాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది యువత, డీఎస్సీ అఽభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగుల నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు హోరెత్తాయి. నిరుద్యోగులకు న్యాయం చేసేవరకు పోరుబాట సాగిస్తామని స్పష్టంచేశారు. ర్యాలీ అనంతరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్‌కు వినతిపత్రం అందజేసి డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో కౌశిక్, బొత్స చైతన్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వాకాడ సతీష్, పైడిపునాయుడు, శంకరరావు, వావిలిపల్లి రమణారావు, జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కరుమజ్జి సాయి, టౌన్ అధ్యక్షుడు చెల్లూరి భార్గవ్, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎస్సీ సెల్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన
విజయనగరంలో మహాధర్నా
పాల్గొన్న వేలాదిమంది నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ యువజన నాయకులు
మెరిట్‌కు టీడీపీ సమాధి కట్టిందంటూ మండిపాటు
మెరిట్‌లిస్ట్ ఎందుకు దాచారు?..డేటా ఎందుకు తొలగించారు?
ప్రభుత్వాన్ని నిలదీసిన యువత
డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ కోరుతూ జేసీ సేతు మాథవన్‌కు వినతిపత్రం
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేరుతో అన్యాయం
డీఎస్సీ నియామకాల్లో సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో కనీస గడువు ఇవ్వకుండా అఽభ్యర్థులను తిరస్కరించడం అన్యాయం. పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్మనం. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. – కోలగట్ల శ్రావణి, మాజీ డిప్యూటీ మేయర్
యువత ఆశలకు గండి
ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన యువతకు డీఎస్సీ ఒక ఆశాకిరణంగా కనిపించింది. నియామకాల ప్రక్రియలో వచ్చిన ఆరోపణలు నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. యువతకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. డీఎస్సీపై వచ్చిన అన్ని ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలి.
– శోభా స్వాతిరాణి, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నిరుద్యోగులు,
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు


