విజయనగరం అర్బన్: పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ది ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ కమి టీ ఎన్నికలను జూన్ 17న నిర్వహించనున్న ట్టు ఎన్నికల అధికారి, సహకార శాఖ జిల్లా అధికారి పి.రమేష్ తెలిపా రు. ఈ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన ఆదివారం వెల్లడించారు. ఈ క్లబ్ నిర్మాణంలో భాగంగా కమిటీకి అధ్యక్షు డి గా కలెక్టర్, ఉపాధ్యక్షులుగా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. కమిటీలో కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరుగుతాయి. కార్యవర్గ సభ్యులుగా అధికారుల విభాగం నుంచి నలుగురిని, నాన్ అఫీషియల్స్ విభాగం నుంచి ఐదుగురిని ఎన్నుకుంటారు. మొత్తం 12 మంది సభ్యులతో ఈ నూతన కమిటీ ఏర్పాటవుతుంది. క్లబ్‌లో రెండు విభాగాల్లో కలిపి ప్రస్తుతం 300 మంది సభ్యులు ఉన్నారు. వీరికి సంబంధించిన ఓటర్ల జాబితాను ఇప్పటికే క్లబ్ ఆవరణలో ప్రదర్శించారు. క్లబ్‌లో కనీసం ఐదేళ్ల పాటు సభ్యత్వం పూర్తి చేసుకున్న వారు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి నియమ నిబంధనలపై చర్చించడానికి వీలుగా ఎన్నికల కంటే ముందే జూన్ 7న క్లబ్ సభ్యులందిరితో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారి రమేష్ తెలిపారు.
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను తక్ష ణమే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. స్థానిక ఓ పాఠశాలలో జిల్లా కమిటీ ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సైద్ధాంతిక శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. 2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత నుంచి శాశ్వత మినహాయింపు ఇచ్చేలా విద్యా చట్టానికి అవస రమైన సవరణలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించడానికి అడ్డంకిగా మారిన వివాదాస్పద జీఓ 223ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వేతన సవరణ కోసం వెంటనే కొత్త పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆలోగా ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సరెండ ర్ లీవ్ బకాయిలతో పాటు జీపీఎఫ్, ఏపీజీఎల్ ఐ క్లైమ్‌లు, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు కొవ్వాడ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇజ్జిరోతు రామునాయుడు, వీవీజే సుబ్రహ్మణ్యం, ఆర్థిక కార్యదర్శి ఎ. తాతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రమణ, కె.సంతోషలక్ష్మి పాల్గొన్నారు.
పార్వతీపురం: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సేవలందించిన సి. యశ్వంత్‌కుమార్ రెడ్డికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీ కావడంతో కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ పదవులు తాత్కాలికమైనవైనా, ప్రజల కోసం చేసిన సేవలు శాశ్వత గుర్తింపు ను తెస్తాయన్నారు. జిల్లా అభివృద్ధికి యశ్వంత్ కుమార్‌రెడ్డి అందించిన సేవలను ప్రశంసిస్తూ, కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత తదితర అధికారులు ఆయన పరిపాలనా నైపుణ్యాన్ని కొనియాడారు. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన అనుభవం ఎంతో సంతృప్తినిచ్చిందని, సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు ఆయనను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


