● పద్మశ్రీ యడ్ల గోపాలరావు
రాజాం సిటీ: భాష ఏదైనా నాటక రచన గొప్ప ప్రక్రియ అని పద్మశ్రీ యడ్ల గోపాలరావు అన్నారు. నాటకంలోని సాహిత్యం సాహితీవేత్తలను అలరిస్తే, ప్రదర్శన సమయంలో నటుల నటన పండితుల్ని, సామాన్యుల్ని కూడా రంజింపజేస్తుందని కొనియాడారు. ఆదివారం స్థానికంగా రాజాం రచయితల వేదిక 136వ సమావేశం నిర్వహించారు. సమావేశంలో దివంగత కాకినాడ పూజ్యనాథం ఆచారి రచించిన ‘రావణబ్రహ్మ’ పద్య నాటక పుస్తకాన్ని గోపాలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప గొప్ప కవులు రాయబట్టే గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటకాలు నేటికీ నిలిచి ఉన్నాయన్నారు. రావణబ్రహ్మ నాటకం కూడా వాటి కోవకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రచయిత భార్య కాకినాడ సర్వలక్ష్మిని రాజాం రచయితల వేదిక సభ్యులు ఘనంగా సత్కరించారు. రంగస్థల నటుడు, సంస్కృత పండితులు బౌరోతు శంకరరావును రంగస్థల నాటక సేవలను గుర్తించి సత్కరించారు. గార రంగనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అతిథులుగా ద్విశతావధాని మరడాన శ్రీనివాసరావు, మేడూరి సత్యనారాయణమూర్తి, పాటోజు బ్రహ్మాజీరావు, లంక సూర్యారావు, ప్రముఖ వైద్యులు గార రవిప్రసాద్, కోడ పురుషోత్తం, డాక్టర్ ఆల్తి మోహనరావు, పిల్లా తిరుపతిరావు, గార సీతారత్నం, లంక విజయభాస్కర్, ఒమ్మి రమణమూర్తి, పొట్నూరు కోటిబాబు, రాజాపు శాంతారావు తదితరులు పాల్గొన్నారు.


