కూతురి దగ్గరికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..! | - | Sakshi
Sakshi News home page

కూతురి దగ్గరికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..!

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

కూతురి దగ్గరికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..! స్కూటీపై నుంచి జారి పడి మహిళ.. యువతి ఆత్మహత్య..

బస్సు ప్రమాదంలో జె.గుమడాం మహిళ మృతి

బొండపల్లి: బాధ్యతలు నెరవేర్చాల్సిన సమయంలో ఇంటి యజమాని మృత్యువాత పడ్డాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లకు తల్లే అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుతూ పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకుని జీవితం హాయిగా సాగుతున్న సమయంలో బస్సు ప్రమాదం ఆ తల్లిని మృత్యుఒడిలోకి తీసుకువెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బొండపల్లి మండలంలోని జె.గుమడాం గ్రామానికి చెందిన లెంక ఈఽశ్వరమ్మ(57) ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆదివారం వేకువ జామున విశాఖపట్నంలోని గాజువాకలో మృతి చెందింది. ఈశ్వరమ్మకు భర్త వెంకటరమణతో పాటు ఇద్దరు కూతుళ్లు లక్ష్మి,దివ్య లు ఉన్నారు. భర్త కొద్ది సంవత్సరాల క్రితం మృతిచెందగా ఇద్దరు కూతుళ్లకు తానే పెళ్లిళ్లు చేసింది. చిన్న కూతురు దివ్యను రాజమండ్రిలో గల యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. మనుమడు వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి రాగా మనుమడిని కూతురి ఇంటికీ దిగబెట్టేందుకు ఈశ్వరమ్మ వెళ్లి తిరుగు ప్రయాణంలో పార్వతీపురం డిపోకు చెందిన బస్సులో రాజమండ్రి నుంచి వస్తుండగా టైరు పంక్చర్‌ అయి నిలిపి ఉంచిన టిప్పర్‌ను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వరమ్మ అక్కడిక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంనిమిత్తం విశాఖపట్నంలోకి కేజీహెచ్‌కు తరలించారు. మొదట తండ్రి, తర్వాత తల్లి మృతి చెందడంతో వారి ఇద్దరి కూతుళ్ల రోదనలు సంఘటనా స్థలం వద్ద చూపరుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి. ఇదే ప్రమాదంలో సాలూరుకు చెందిన రాయంపిల్లి రాంబాబు (50) మృతి చెందినట్లు గుర్తించారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల

ఎక్స్‌గ్రేషియా

గాజువాక శ్రీనగర్‌ జంక్షన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రమాద స్థలాన్ని, దెబ్బతిన్న ఆర్టీసీ బస్సును ఆయన పరిశీలించారు.

పూసపాటిరేగ : మండలంలోని కందివలస జంక్షన్‌ సమీపంలో జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వివరాలలోకి వెళ్తే.. శ్రీకాకుళంలో ఉంటున్న తన చెల్లి ఇంటికి విశాఖ జిల్లా కొమ్మాదికి చెందిన కోన రమ (44) స్కూటీపై వెళ్తుండగా పూసపాటిరేగ మండలం కందివలస సంత సమీపంలో తాను ప్రయాణిస్తున్న స్కూటీకి ప్రమాదం జరగడంతో కిందపడి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రమ భర్త కోటేశ్వర్రావు గతంలోనే చనిపోయారు. ఇద్దరు పిల్లలతో తండ్రి వద్దనే చిన్నపాటి ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు అనుకోని విధంగా మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత లేదు. సెల్ఫ్‌ ప్రమాదం జరిగిందా లేదా ఏదైనా వాహనం తగిలి ప్రమాదం జరగడంతో కింద పడి మృతి చెందిందా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం క్రైమ్‌: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఉంటున్న ఓ రూమ్‌లో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో రూమ్‌ తీసుకుని గ్రూప్‌–2,పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోంది. రూమ్‌ పక్కనే ఉన్న రీడింగ్‌ రూమ్‌కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్‌కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్‌లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్‌లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్‌లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్‌ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement