అంతర్జాతీయ చెస్‌ పోటీలకు కంచరాం విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ చెస్‌ పోటీలకు కంచరాం విద్యార్థిని

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

రాజాం: మండలంలోని కంచరాం జెడ్‌పీ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని కలిశెట్టి పావని అంతర్జాతీయ చెస్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు టి.దుర్గయ్య ఆదివారం తెలిపారు. జూన్‌ 1 నుంచి 8 వరకూ అమరావతి విట్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ పైడ్‌ రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌–2026 క్రీడల్లో ఆమె పాల్గొంటుందని వెల్లడించారు. అండర్‌ 15 విభాగంలో రాష్ట్ర క్రీడాకారిణిగా ఎంపికై ందని, ఇటీవల రాజాంకు చెందిన పలుశాఖల అధికారులు అందించిన ఆర్థికసాయంతో ఎంట్రీ ఫీజు చెల్లించిందని వెల్లడించారు. ఆమె ఎంపికపట్ల పాఠశాల హెచ్‌ఎం వై. గౌరునాయుడు, పీఈటీ బీఎన్‌ నాయుడు, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్‌, ఉపాధ్యాయులు లెంక శ్రీనివాసరావు, పండూరి వేణుగోపాలరావు, పి.మహేష్‌, వై.భాస్కర్‌, అరుణ తదితరులతో పాటు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

కేజీన్నర గంజాయితో ఇద్దరు నిందితుల పట్టివేత

విజయనగరం క్రైమ్‌: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై బాలాజీ చెప్పిన వివరాల ప్రకారం విజయనగరం జీఆర్పీ, ఆర్పీఎఫ్‌లు సంయుక్తంగా విజయనగరం రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ ఫామ్‌పై ఆదివారం తనిఖీలు చేస్తుండగా విజయనగరానికి చెందిన మజ్జి కార్తీక్‌, అమలాపురం జిల్లాకు చెందిన పలివెల దుర్గా ప్రసాద్‌ నాగరాజులు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతం నుంచి రూ.75,000 విలువైన 1.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం రైల్వే కోర్టుకు తరలించామని ఎస్సై బాలాజీ తెలిపారు.

ఐదు ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల నాగావళి తీరంలో ఇసుక దందా జోరుగా సాగుతోందని పత్రికల్లో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్‌ ఏఎస్‌.కామేశ్వరరావు శనివారం రాత్రి తమ సిబ్బందితో ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేశారు. ఈ సందర్భంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లు అదుపులోకి తీసుకుని సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఈ ట్రాక్టర్లను వీరఘట్టం పోలీసు స్టేషన్‌కు అప్పగించినట్లు తహసీల్దార్‌ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లేదా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి

డెంకాడ: మండలంలోని చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పాసైన విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి సి–ప్రోగ్రామింగ్‌పై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో ఆదివారం తెలిపింది. వారం రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో సి–ప్రోగ్రామింగ్‌ బేసిక్స్‌ నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. థియరీ తరగతులతో పాటు ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయని, ఆసక్తి ఉన్న అర్హులైన విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. శిక్షణకు వస్తున్న వారు ఫోన్‌ 9441663201ను ఆశ్రయించి, పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

పుస్తక పఠనంపై తర్ఫీదు

గరుగుబిల్లి: మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులలో పఠన అలవాట్లు పెంపొందించేందుకు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్విజ్‌ పోటీలు, భక్తి గీతాలు, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కథలు చెప్పడం, పద్యాలు, గద్యాల పఠనం వంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రతిభను వెలికితీశారు. క్రీడా పోటీలలో భాగంగా క్యారం బోర్డు, బిజినెస్‌, లూడో, చదరంగం వంటి ఆటలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి శాఖాగ్రంథాలయ నిర్వాహకులు ఎన్‌.మధుసూదనరావు పాల్గొని విద్యార్థులకు పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement