● నిమిషాల్లోనే గంజాయి గుట్టురట్టు
● చైన్నె నుంచి వచ్చిన ప్రత్యేక కిట్లు
● జిల్లా పోలీసుల సరికొత్త ప్రయోగం
పార్వతీపురం రూరల్: గంజాయి మహమ్మారికి కళ్లెం వేసేందుకు, మత్తు రక్కసి కోరల నుంచి యువతను కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు సరికొత్త వ్యూహానికి పదునుపెట్టారు. గంజాయి అక్రమ రవాణాదారులను అడ్డుకోవడంతో పాటు, ఆ మత్తులో మునిగితేలుతున్న వారిని సైతం పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు వినూత్న శాసీ్త్రయ విధానానికి శ్రీకారం చుట్టారు. ‘రాపిడ్ యూరిన్ టెస్ట్’ (శీఘ్ర మూత్ర పరీక్ష) ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే మత్తు బాబుల బండారాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఈ పరీక్షల ఆధారంగా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేస్తుండడంతో గంజాయి ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గంజాయిలో ఉండే ‘టెట్రా హైడ్రో కెనాబినాల్’ (టీహెచ్‌సీ) అనే రసాయన ఆనవాళ్లను పసిగట్టేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లతో పోలీసులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల నుంచి మూత్ర నమూనాలను సేకరించి, ఈ కిట్‌లో రెండు చుక్కలు వేయగానే ఫలితం కళ్లకు కడుతుంది. కిట్‌లో ఒకే ఎరుపు గీత కనిపిస్తే గంజాయి పీల్చినట్లు (పాజిటివ్)గా, రెండు గీతలు వస్తే నెగిటివ్‌గా నిర్ధారిస్తున్నారు. ఎవరైనా వారం రోజుల క్రితం గంజాయి పీల్చినా సరే..ఈ కిట్ ద్వారా దొరికిపోతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
చైన్నె నుంచి ప్రత్యేక కిట్లు
ఈ సరికొత్త తనిఖీల కోసం రాష్ట్ర పోలీసు శాఖ నేతృత్వంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తమిళనాడు రాజధాని చైన్నె నుంచి ప్రత్యేక కిట్లను రప్పించారు. సుమారు రూ.450 విలువ చేసే ఒక్కో కిట్‌లో పది టెస్ట్ స్ట్రిప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ నూతన విధానం ద్వారా పరీక్షలు నిర్వహించి, ఇప్పటికే గంజాయి పీల్చిన ఇద్దరిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు పార్వతీపురం సీఐ బెండి వెంకటరావు వెల్లడించారు. అనుమానితులను పరీక్షించి వారు గంజాయి పీల్చారో? లేదో? తేల్చడంతో పాటు, అసలు వారికి ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి లభ్యమవుతోంది? దీని వెనుక ఉన్న శక్తులెవరు? అనే కోణంలో కూపీ లాగుతున్నట్లు ఆయన వివరించారు. యువత మత్తు వలయంలో చిక్కుకోకుండా నివారించేందుకు పోలీసుల చేతిలోని ఈ శాసీ్త్రయ అస్త్రం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


