● అంతా లోకేష్, దేవాన్ష్‌ల భజనే
● హామీలు అమలు చేయకుండా రెండేళ్లుగా మోసం
● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
చీపురుపల్లి: టీడీపీ రెండు రోజులు నిర్వహించిన మహానాడు పేరును కాస్త దగానాడు అని పెట్టుకుంటే బాగుంటుందని వైఎస్‌ఆర్సీపీ పీఏసీ మెంబర్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్‌టీరామారావు ను వెన్నుపోటు పొడిచి, పిల్లను ఇచ్చిన ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు దగానాడు అని పేరు పెట్టుకోవాలని హితవు పలికారు. వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహానాడులో తీర్మానం చేయడం తరువాత వదిలేయడం బాబుకు అలవాటేనన్నారు. మహానాడు లో లోకేష్, దేవాన్ష్ భజన తప్ప ఇంకేం లేదన్నారు. రెండేళ్లలో రాష్ట్రానికి చేసింది చెప్పలేక రానున్న మూడేళ్లలో ఏం చేస్తామో చెప్పుకోలేక మహానాడు వేదికగా ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు.
డీఎస్సీలో అర్హులకు అన్యాయం
ఇటీవల డీఎస్సీ నియామకాల్లో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుందని ఆరోపించారు. డీఎస్సీలో అర్హత సాధించడానికి అర్హత పరీక్ష ప్రామాణికం అయినప్పటికీ స్పోర్ట్స్ కోటా పేరుతో గతంలో ఎన్నడు లేని విధంగా, నిబంధనలకు విరుద్ధంగా శాప్ నుంచి ఇచ్చిన బోగస్ ధ్రువీకరణలతో ఉద్యోగ నియామకాలు చేపట్టడం దారుణమని విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై జరిగిన అవినీతి నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని చెబుతున్న చంద్రబాబును ప్రజలు చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.


