● డీఎస్పీ రాఘవులు
● బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పొగాకు నిషేధ దినోత్సవ అవగాహన ర్యాలీ
విజయనగరం టౌన్: వ్యసనాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని విజయనగరం డీఎస్పీ ఎస్.రాఘవులు సూచించారు. ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం భారీ మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీని జిల్లా పోలీస్‌శాఖ సహకారంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ పొగాకు, డ్రగ్స్, గంజాయి వినియోగంతో కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయని వాటన్నంటికీ ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు, డ్రగ్స్, గంజాయితో వచ్చే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్రహ్మకుమారీస్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన సీఐలు, ఎస్సైలు జిల్లా నలుమూలల నుంచి బ్రహ్మకుమారీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


