● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం: పరిసరాల పరిశుభ్రత ప్రజలందరి బాధ్యతని లెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతీఒక్కరూ ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా కణపాక వద్ద కాలువల్లో పూడికలు తొలగించే ప్రక్రియను శనివారం ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీలైనంత వరకు పాలిథిన్‌ను, తడిచెత్తను వేరుచేయాలని, తడిచెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడంలో మున్సిపల్ సిబ్బందికి పౌరులు తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ నగరంలోని సుమారు 392 కిలోమీటర్ల మేర కాలువలు, డ్రైన్లను పూర్తిగా శుభ్రపరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కమిషనర్ కె.అప్పలరాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సాంబమూర్తి, ఇతర అధికారులు, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


