రాజాం: వంగర మండలంలోని ప్రభుత్వ కస్తూరీబా గాంధీ విద్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కెంబూరు సరస్వతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజాం మున్సిపాలిటీ పరిధి బుచ్చింపేటలో సరస్వతి తాత్కాలికంగా నివసిస్తుండగా, ఈమె స్వగ్రామం రేగిడి మండలం మజ్జిరాముడుపేట గ్రామం. ఈమైపె మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కరణం శ్రీనివాసరావు ఆన్‌లైన్‌లో ప్రజా ఫిర్యాదుల వేదికకు ఈనెల 28న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఏడాదికి రూ.2.88 లక్షల జీతం తీసుకుంటున్న ఈమె 2020–21 ఏడాదిలో తప్పుడు వివరాలతో పీఎంఏవై పథకం ద్వారా రాజాం పట్టణంలోని కంచరాం సమీపంలోని లేఅవుట్ –1లో 574 నంబర్‌తో ఇంటి పట్టా పొందిందని ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజాం రెవెన్యూ అధికారులు శనివారం ఫిర్యాదుదారుని వద్ద వివరాలు సేకరించడంతో పాటు కేజీబీవీ ఉద్యోగిని కెంబూరు సరస్వతిని కూడా విచారించారు. రాజాం తహసీల్దార్ ఎం.రాజశేఖరం పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని, ఈమె మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో ఆ కార్యాలయానికి ఈ ఫిర్యాదులు పంపిస్తున్నామని ఆర్‌ఐ మహేశ్వరరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఉద్యోగినిపై ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తప్పుడు వివరాలతో అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను ఉద్యోగిని, ఆమె కుటుంబీకులు మోసగించారని ఆరోపించారు.


