విజయనగరం రూరల్:
చంద్రబాబు సర్కారు 2025లో నిర్వహించినది మెగా కాదు.. దగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ జిల్లా విద్యా విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కూడలి వరకు ర్యాలీగా వచ్చిన విద్యా, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. డీఎస్సీ–2025 అక్రమాలపై అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యా, యువజన విభాగం నాయకులు కరుమజ్జి సాయికుమార్, అల్లు అవినాష్, ఈశ్వర్ కౌశిక్‌లు మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరు చెప్పి డీఎస్సీ అభ్యర్థులను చంద్రబాబు సర్కారు మెగా దగా చేసిందని మండిపడ్డారు. మెరిట్ ముందున్న అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి రెండు రోజుల్లోనే జాబితాలు మార్చివేశారని దుయ్యబట్టారు. మెరిట్ జాబితా బయటపెట్టకపోవడంలో ఆంతర్యమేంటని వారు నిలదీశారు. మెరిట్ జాబితా రద్దు చేయడంతో మెరిట్ సాదించిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణ సక్రమంగా చేపట్టడంలో విఫలమైన విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని స్పష్టంచేశారు. చంద్రబాబు సర్కారు ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను వంచించారని, ఎన్నో సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలను దగా చేశారని మండిపడ్డారు. ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వలంటీర్లకు పదివేల జీతమని చెప్పి, ఆ వ్యవస్థనే రద్దు చేసి వలంటీర్ల నెత్తిన శఠగోపం పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుదేనని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఊసేలేదని, 2029 ఎన్నికల్లో చంద్రబాబు సర్కారుకు తగిన గుణపాఠం చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ విద్యా విభాగం అధ్యక్షులు బమ్మిడి కార్తీక్, వైఎస్సార్ సీపీ యువజన, విద్యా విభాగం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ నియామకాలపై సీబీఐ
విచారణకు డిమాండ్
మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
వైఎస్సార్‌సీపీ విద్య, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన


