శృంగవరపుకోట: ఇప్పటికే అధికార బలంతో కొండ భూములు, ప్రభుత్వ బంజరు, ఢీ పట్టా భూములు, చెరువులు కబ్జాచేశారు.. జీవాల మేతకు ఆధారమైన 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండను ఇప్పుడు పర్యాటకాభివృద్ధి పేరుతో ఓ వ్యక్తికి కట్టబెట్టేందుకు చూస్తున్నారు.. ఇదెక్కడి అన్యాయం... కొండజోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఎస్.కోట మండలంలోని కృష్ణాపురం గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పారు. సర్వే నంబర్ 38లో 30ఎకరాల ప్రభుత్వ భూమిని కె.వి.ఎన్.గోవిందరావు అనే వ్యక్తికి ఎకో టూరిజం పేరుతో కట్టబెట్టే చర్యలు మానుకోవాలని, గ్రామసభను నిర్వహించి, గ్రామస్తుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు కృష్ణాపురం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకాధికారి కె.రవీంధ్ర అధ్యక్షతన తహసీల్దార్ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది గ్రామంలో శుక్రవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడే క్రమంలో వేలుచూపి మాట్లాడడంతో గ్రామపెద్దలు ‘బెదిరింపులకు దిగటం సరికాదు. బెదిరించి భూములు లాక్కుని, ఎవరికో వత్తాసు పలకటానికి గ్రామసభ పెట్టారా’ అంటూ ధ్వజమెత్తారు. గ్రామానికి చెందిన న్యాయవాది వారాది ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎం.యామినీదేవి, వేండ్రపు శ్రీనివాసరావు, కర్రి తాతారావు, సింగంపల్లి శ్రీను, కె.ఎరుకునాయుడు తదితరులు మాట్లాడుతూ ‘గతంలో గ్రామంలో భూములు కొనుగోలుచేసిన గోవిందరావు బంజరు భూములు, చెరువులు, డీ పట్టా భూములను కబ్జాచేశారు. కొండగెడ్డ నుంచి వర్షపునీరు చెరువులో చేరకుండా చేపల చెరువులు తవ్వారు. అతని భూములను ఆనుకుని ఉన్న మా భూముల్లోకి వెళ్లనీయకుండా గేటువేసి, కంచె వేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అండ ఉందంటూ రైతుల నుంచి బెదిరించి భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ఇక్కడి జీవాల పెంపకం దారులకు కొండే ఆధారం. అదికూడా లాక్కుంటే ఊరుకునేది లేదు. తరాలుగా ఇక్కడే పుట్టాం, పెరిగాం, చస్తాం.. కాదని కొండ జోలికొస్తే ఉద్యమిస్తాం అంటూ గ్రామస్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామస్తుల ఆందోళనతో ఎకో టూరిజం కోసం దరఖాస్తు చేసిన గోవిందరావు సభ నుంచి జారుకున్నారు. ప్రత్యేకాధికారి కె.రవీంద్ర గ్రామస్తుల నిర్ణయాన్ని తీర్మానంగా రాయించి గ్రామస్తుల సంతకాలు తీసుకున్నారు. దీనిని కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు.
రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పిన
కృష్ణాపురం గ్రామస్తులు
పర్యాటకం ముసుగులో కొండను
కాజేయొద్దు
జీవాల మేతకు కొండే ఆధారం


